సీఎం ఇలాకాలో ఇండ్ల కూల్చివేత

సీఎం ఇలాకాలో ఇండ్ల కూల్చివేత
  • కాళ్లకల్​లో తీవ్ర ఉద్రిక్తత
  • భారీగా పోలీసుల మోహరింపు
  • జేసీబీలతో ఇండ్లు, షెడ్లు నేలమట్టం
  • మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆందోళన 

మెదక్, మనోహరాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి ఇలాకాలో కూల్చివేతలు కలకలం సృష్టించాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయిన కాళ్లకల్ లో గురువారం అనుమతులు లేకుండా ఇండ్లు నిర్మించారంటూ కూల్చివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల కొందరు గ్రామంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తూప్రాన్​డీఎల్పీవో శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పంచాయతీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, 45 మంది పంచాయతీ సెక్రటరీలు 8 బృందాలుగా విడిపోయి జేసీబీలతో తొమ్మిది ఇండ్లను, మూడు షెడ్లను కూల్చివేశారు. దీనికి తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తుకు వచ్చారు.

నోటీసులు ఇవ్వలేదంటూ 

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆఫీసర్లు, పోలీసులతో.. స్థానికులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కార్యకర్తలతో అక్కడి చేరుకొని కూల్చివేతలను  అడ్డుకున్నారు. నేషనల్ ​హైవేపై రాస్తారోకో చేయడానికి స్థానికులతో కలిసి వెళ్తుండగా పోలీసులుఅడ్డుకున్నారు. 

దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. నర్సారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లయినా సీఎం కేసీఆర్​ కాళ్లకల్​లో తొమ్మిది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కూడా కట్టించలేని, ప్రజలు పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను కూల్చివేయించడం దారుణమన్నారు. ఆందోళన చేస్తుండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. 

దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్ లోని అతడి ఇంటి దగ్గర వదిలి పెట్టి వచ్చారు. మళ్లీ గంట తర్వాత నర్సారెడ్డి కార్యకర్తలతో కాళ్లకల్ చేరుకొని పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. బాధితులను పరామర్శించేందుకు  సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి వస్తుండగా పోలీసులు అడ్డుకొని, స్టేషన్ కు తరలించి కొద్ది సేపటి తరువాత వదిలిపెట్టారు. 

సీఎం డౌన్​ డౌన్​...

ఇండ్ల కూల్చివేత నేపథ్యంలో కాళ్లకల్​ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నేషనల్​ హైవేపై బైఠాయించారు. దీంతో రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 

కాళ్లకల్ ఉపసర్పంచ్ తుమ్మల రాజు ఇంటి వద్ద కూడా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాజు ఫిర్యాదు మేరకే ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు కూడా షెడ్ ను అక్రమంగా నిర్మించాడని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఉప సర్పంచ్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సర్కారుకు మా ఉసురు ముడుతది

నిన్ననే మా ఇంటికి స్లాబ్ వేసినం. తెల్లారే కూల్చివేసిన్రు. పొద్దున ఆరు గంటలకే వచ్చి జేసీబీతో ఇల్లు కూల్చివేస్తుండడంతో మా పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పిన్రు. మేముంటున్న ఇంట్లోకి వెళ్లి ఇంటికి సంబంధించిన పేపర్లు తీసుకొచ్చేలోపు కూల్చేసిన్రు. మా అమ్మ చనిపోయింది.  మేము ముగ్గురం ఆడపిల్లలం. రోజు కూలీ చేస్తూ రూపాయి రూపాయి దాచుకుని 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటుంటే కూల్చేసిన్రు. ప్రభుత్వానికి మా  ఉసురు ముడుతది. 
-  కనిగిరి శిరీష, కాళ్లకల్​ 

పేదోళ్లు అల్కగ దొర్కుతరు 

కొన్ని నెలల క్రితం నా భర్త సచ్చిపోయిండు. ఆయన పేరు మీద ఇన్స్యూరెన్స్ పైసలు రావడంతో ఇల్లు కట్టుకుంటున్నా. సర్కారోళ్లు పొద్దుగాల్లనే వచ్చి మా ఇల్లు కూలగొట్టిన్రు. గింత ఘోర ముంటదా ఏడనన్న. పెద్దోళ్లను ఏమనరు..పేదోళ్లే అల్కగ దొర్కుతరు.
‌‌ - మేకల రాణి, కాళ్లకల్​