కూతురు చదువు కోసం యజమాని ఇంటికి కన్నం..30 తులాల ఆభరణాలు చోరీ .. నిందితురాలు అరెస్ట్

కూతురు చదువు కోసం యజమాని ఇంటికి కన్నం..30 తులాల ఆభరణాలు చోరీ  .. నిందితురాలు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ తన కూతురు చదువు కోసం యజమాని ఇంటికే కన్నం వేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్​చేశారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్​ఫయాజ్​తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి నిజాం కాలనీకి చెందిన మీర్ షఫీ అలీఖాన్ ఇంట్లో ఇదే ప్రాంతానికి చెందిన సబియా బేగం 20 ఏండ్లుగా పని మనిషిగా చేస్తోంది. 

గత నెల 20న ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని అలీఖాన్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గురువారం సబియా బేగం నగలు విక్రయించేందుకు స్థానిక ఓ జ్యువెలరీ షాప్​కు వెళ్లింది. 

ఆ షాప్​యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ రమేశ్​తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సబియా బేగంను అదుపులోకి తీసుకొని, ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కూతురు ఇంజినీరింగ్ చదువు కోసం ఈ చోరీ చేసినట్లు చెప్పింది. నిందితురాలిని అరెస్ట్​చేసి, రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.