- మావోయిస్టుల సరెండర్లలోనూ అగ్రస్థానంలో..పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు పెరిగినయ్
- పెరిగిన పగటి దొంగతనాలు... తగ్గిన రాత్రి చోరీలు
- ఏడాది క్రైం వివరాలు వెల్లడించిన ఎస్పీ బి. రోహిత్ రాజు
- వచ్చే ఏడాది ట్రాఫిక్, రోడ్ యాక్సిడెంట్ల నివారణపై స్పెషల్ ఫోకస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో స్టేట్‌లోనే జిల్లా టాప్‌లో ఉంది. మావోయిస్టులను సరెండర్ చేయడంతో పాటు అరెస్టు చేయడం, వారిని కట్టడి చేయడంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే తమ సత్తా చాటారు. పగటి దొంగతనాలు పెరుగగా, రాత్రి దొంగతనాలు తగ్గాయి. గతంతో పోల్చుకుంటే రోడ్ యాక్సిడెంట్స్, మృతుల సంఖ్య పెరిగింది. ఎస్సీ, ఎస్టీతో పాటు పోక్సో కేసులు మస్తు పెరిగినయ్. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ ఏడాదిలో జరిగిన క్రైం వివరాలను ఎస్పీ బి. రోహిత్ వెల్లడించారు.
కేసుల వివరాలు ఇలా..
జిల్లాలో గతేడాది 5,636 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6,180 కేసులు నమోదయ్యాయి. గతేడాది మీద పోలిస్తే 544కేసులు ఈ ఏడాది అధికంగా నమోదయ్యాయి.
లాస్ట్ ఇయర్ 112 గంజాయి కేసులు నమోదు అయ్యాయి. రూ. 40కోట్ల విలువైన 8,078 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో 70 కేసులు నమోదయ్యాయి. రూ. 28.50కోట్ల విలువైన 5,707 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై పీడీ చట్టాన్ని నమోదు చేశారు. గంజాయి ట్రాన్స్‌పోర్టు చేస్తున్న వారి ఆస్థులురూ. 48లక్షలు జప్తు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కేసులు లాస్ట్ ఇయర్ 102 ఉండగా, ఈ ఇయర్లో 122గా నమోదయ్యాయి.
పోక్సో కేసులు లాస్ట్ ఇయర్ 105 ఉండగా, ఈ ఏడాదిలో 128 నమోదయ్యాయి.
ఈ ఏడాది జిల్లాలో 307 దొంగతనాల కేసుల్లో రూ. 3.75కోట్ల మేర ప్రాపర్టీ పోగా, రూ. 1.21కోట్లను రికవరీ చేశారు.
జిల్లాలో ఈ ఏడాదిలో 23 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 253 మంది రౌడీషీటర్లున్నారు.
జిల్లాలో పలు కేసులకు సంబంధించి ఏడుగురిపై జీవిత ఖైదు శిక్ష పడింది. రెండు కేసుల్లో 20 ఏండ్లు, ఐదు కేసుల్లో పదేండ్ల జైలు శిక్షలు పడ్డాయి.
మావోయిస్టుల సరెండర్‌తో పాటు వారిని నియంత్రించడంలో రాష్ట్రంలోనే జిల్లా పోలీసులు కీలక భూమిక పోషించారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఏసీఎం క్యాడర్ ఒకరిని, దళం మెంబర్లు ముగ్గురిని అరెస్టు చేశారు. 326 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఇందులో డీవీసీఎం, ఏసీఎం, దళం మెంబర్స్, మిలీషియా కమాండర్స్ తో పాటు మావోయిస్టు పార్టీకి చెందిన పలు విభాగాలు, ప్రజా సంఘాలకు చెందినవారున్నారు.
జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన లోక్ అదాలత్‌లలో 20, 595కేసులు పరిష్కారం అయ్యాయి.
జిల్లాలో పోగొట్టుకున్న 948 సెల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేశారు.
కోళ్ల పందేలాకు సంబంధించి ఈ ఏడాదిలో 28 కేసులు నమోదయ్యాయి.
రూ. 5కోట్ల విలువైన 1,75,455లీడర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. 290కేసులు నమోదు చేసి 319మందిని అరెస్టు చేశారు.
ఆపరేషన్ ముస్కాన్, స్మైల్‌లో భాగంగా జిల్లాలో 66 మంది చిన్నారులను కాపాడారు. పిల్లలను పనిలో పెట్టుకున్న 94 మందిపై కేసులు పెట్టారు.
యాక్సిడెంట్లు, గంజాయి వినియోగంపై ఫోకస్ : వచ్చే ఏడాదిలో రోడ్యాక్సిడెంట్లు, ట్రాఫిక్ నియంత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాదిలో రోడ్ యాక్సిడెంట్లు కొంత పెరిగాయన్నారు. మృతుల సంఖ్య పెరగడంపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు యాక్సిడెంట్లను వీలున్న మేర తగ్గించడంతో పాటు ట్రాఫిక్‌పై ప్రజలు, యూత్, స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. మైనర్లకు వెహికల్స్ ఇచ్చే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణాను చాలా వరకు కట్టడి చేయగలిగామన్నారు.
లోకల్‌గా గంజాయి తాగే వారిపై వచ్చే ఏడాది ప్రత్యేక నిఘా పెట్టనున్నట్టు తెలిపారు. గంజాయి తాగడం వల్ల కలిగే దుష్ప్రచారాలపై స్టూడెంట్స్, యూత్‌కు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో రెండు నుంచి మూడు వరకు గోశాలలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. క్రైం రేట్ తగ్గించేందుకు పోలీసులు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రూ.2కోట్లతో మొబైల్ హాస్పిటల్, రూ. 2కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గతేడాది, ఈ ఏడాదిలో జరిగిన కేసుల వివరాలు
కేసులు 2025 2024
మర్డర్లు 23 24
అత్యాచారాలు 83 89
కిడ్నాప్‌లు 59 77
మహిళా వేధింపులు 384 420
రాబరీ 05 05
చీటింగ్స్ 425 303
ఈ-పెట్టీ కేసులు 2,499 6,897
డ్రంకెన్ డ్రైవ్ 15,347 12,701
ఈ-చలాన్లు 4,22,019 4,37,592
పీడీఎస్ రైస్ 38 71
ఇసుక 301 215
గేమింగ్ యాక్ట్ 147 206
సైబర్ 196 221
