- సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం పాలకవర్గాల ఎన్నిక నేటికీ వాయిదా
- మెదక్ జిల్లాలో 3 బల్దియాలు 'హస్త'గతం బీజేపీ మద్దతుతో తూప్రాన్ లో బీఆర్ఎస్ చైర్ పర్సన్
- సిద్దిపేటలో మహిళలేదే హవా
- మూడు చోట్ల బీఆర్ఎస్, ఒక చోట కాంగ్రెస్
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం 17 మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం బల్దియాల్లో కోరం లేక చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాలు, బీఆర్ఎస్ 8 స్థానాలు దక్కించుకున్నాయి.
ఉదయం 11 గంటలకు ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం సరిపడ కోరం ఉందని నిర్ధారించుకుని ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలో 17 బల్దియాల్లో ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో కూడా పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో 9 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన సభ్యులు మీటింగ్ హాల్లోకి చేరుకోగా వరుస క్రమంలో ఎన్నికైన సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
సంగారెడ్డి, సదాశివపేట, అందోల్ -జోగిపేట్, కోహిర్, నారాయణాఖేడ్, ఇస్నాపూర్, గుమ్మడిదల గడ్డపోతారం, జిన్నారం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. అనంతరం మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో అధికార పార్టీ సత్తా చాటింది. నాలుగు మున్సిపాలిటీలు ఉండగా మూడింటిలో కాంగ్రెస్ కు చైర్పర్సన్ పదవులు దక్కాయి. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు15, కాంగ్రెస్‌కు 14, బీజేపీకి ఇద్దరు, బీఎస్పీ కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. 15 కౌన్సిలర్ స్థానాలతో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన కౌన్సిలర్ల మద్దతు లభించలేదు. బీఎస్పీ నుంచి గెలిచిన 17వ వార్డు కౌన్సిలర్ బి.అరుణ కాంగ్రెస్ కు మద్దతివ్వగా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుఎక్స్అఫిషియో ఓటు కలుపుకుని ఆ పార్టీ బలం16కు చేరింది.
చేతులెత్తే పద్దతిలో ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థికి 14 మంది కాంగ్రెస్, ఒక బీఎస్పీ కౌన్సిలర్ తోపాటు, ఎమ్మెల్యే రోహిత్ చేతులెత్తి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే లభించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కానుగు రాధిక చైర్పర్సన్ గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి జడ్పీ సీఈఓ ఎల్లయ్య ప్రకటించారు. తర్వాత వైస్ చైర్‌పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ దొంతి నరేశ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తూప్రాన్ లో నాటకీయత
తూప్రాన్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3 సీట్లు గెలుపొందాయి. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ బొంది రజినికి ఆ పార్టీకి చెందిన మిగతా ఏడుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. 5వార్డు కౌన్సిలర్ చెలిమల ప్రియాంక మద్దతివ్వలేదు.
బీజేపీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ మన్నె స్వామి మద్దతుగా చేయి లేపడంతో రజిని చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ పదవికి 6వ వార్డు కౌన్సిలర్ సమతారెడ్డి పేరును ప్రతిపాదించగా బీఆర్ఎస్ కు చెందిన 8 మంది, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ చేయిలేపి మద్దతివ్వడంతో ఆమె వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లకు కాంగ్రెస్‌కు చెందిన 8 మంది గెలుపొందడంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే1వ వార్డు కౌన్సిలర్ గజవాడ లావణ్య చైర్పర్సన్ గా, అదే పార్టీకి చెందిన పోచమ్మల నవనీత వైస్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిద్దిపేటలో మహిళలే మహారాణులు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లుగా మహిళలే ఎన్నికయ్యారు. గజ్వేల్, చేర్యాల, దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను కాంగ్రెస్ గెలుచుకుంది. హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా దండి లక్ష్మి (కాంగ్రెస్), వైస్ చైర్ పర్సన్ గా చిత్తారి పద్మ (కాంగ్రెస్) ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశానికి హాజరయ్యారు. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గంగిశెట్టి చందన (బీఆర్ఎస్), వైస్ చైర్ పర్సన్‌గా కల్యాణ్ కర్ పద్మబాయి(బీఆర్ఎస్) ఎన్నికయ్యారు.
గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు11 మంది కౌన్సిలర్లు ఉండగా ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు ఇండిపెండెట్, బీజేపీ అభ్యర్థి సైతం బీఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థికే మద్దతు తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా శ్రీరాం సంగీత(బీఆర్ఎస్), వైస్ చైర్ పర్సన్ గా ఆస సులోచన (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరు కాగా 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక్క ఎఐఎఫ్ బీ కౌన్సిల ర్ బీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతు తెలిపారు. చేర్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా ముస్త్యాల అరుణ బాల నర్సయ్య(బీఆర్ఎస్), వైస్ చైర్ పర్సన్ గామేడిశెట్టి ఉమా శ్రీధర్ (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న బీఆర్ఎస్ చైర్ పర్సన్ తోపాటు వైస్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకుంది.
చేర్యాలలో క్రాస్ ఓటింగ్
చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్యకు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ మల్లేశం మద్దతు తెలిపింది. ఇక్కడ బీఆర్ఎస్ కు ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా కాంగ్రెస్ కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ బీఆర్ఎస్ అభ్యర్థికి చెయ్యి ఎత్తి మద్దతు తెలిపింది. వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి వెలుగుల దుర్గయ్యకు మద్దతిచ్చారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పలు సూచనలు ఇచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. గజ్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా కల్యాణ్ కర్ పద్మాబాయికి ఇవ్వకుండా వైస్ చైర్మన్ గా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆమె అనుచరులు నిరసన తెలిపారు. కౌన్సిలర్ కల్యాణ్ కర్ పద్మాబాయి భర్త నర్సింగ రావు వంటేరు ప్రతాప రెడ్డి అన్యాయం చేశారని ఆరోపించారు.
నర్సాపూర్ లో కాంగ్రెస్, బీజేపీ పరస్పర సహకారం
బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో నర్సాపూర్ చైర్ పర్సన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోగా, కాంగ్రెస్ మద్దతుతో వైస్ చైర్ పర్సన్ పదవి బీజేపీకి దక్కింది. చైర్ పర్సన్ పదవికి కాంగ్రెస్ కు చెందిన 5వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ రాజు యాదవ్ పోటీ చేశారు. ఆ పార్టీకి ఆమెతో కలిపి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండగా నలుగురు బీజేపీ కౌన్సిలర్లు మద్దతిచ్చారు. దీంతో లక్ష్మీ రాజు యాదవ్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.
వైస్ చైర్ పర్సన్ పదవికి బీజేపీకి చెందిన 3వ వార్డు కౌన్సిలర్ వనముల బుచ్చేశ్ యాదవ్, బీఆర్ఎస్కు చెందిన పంబాల లలిత పోటీ చేశారు. లలితకు ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు, ఎక్స్ అఫిషియో ఓటరు అయిన ఎమ్మెల్యే సునీతారెడ్డిని కలుపుకుని ఆరుగురు మద్దతు మాత్రమే ఉండగా, బుచ్చేశ్ యాదవ్ కు నలుగురు బీజేపీ కౌన్సిలర్ల బలంతో పాటు ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు లభించడంతో ఆయన వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
