మహిళలకు అందలం..నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్ పర్సన్లంతా వారే

మహిళలకు అందలం..నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్ పర్సన్లంతా వారే
  •  
  • బోధన్​లో రెండోసారి తూము పద్మ రికార్డ్
  • ఆర్మూర్​, భీంగల్​లో దక్కిన అవకాశాలు 
  • ఫలించిన కాంగ్రెస్​ మంత్రాంగం
  • కామారెడ్డిలో చైర్​పర్సన్​ దక్కించుకున్న కాంగ్రెస్ 
  • బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుందలో అన్ని పదవులు కాంగ్రెస్​కే

నిజామాబాద్ /కామారెడ్డి, వెలుగు : నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్​, బోధన్​, భీంగల్ మున్సిపాలిటీల్లో మేయర్​, చైర్​ పర్సన్​ స్థానాలు కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్​దక్కించుకుంది. అధిక శాతం చైర్​పర్సన్​, వైస్​చైర్​పర్సన్​ పదవులు మహిళలకు ఇచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. మజ్లిస్​తో పొత్తులో భాగంగా బోధన్​ వైస్​ చైర్​పర్సన్​​, ఆర్మూర్​ మున్సిపాలిటీలో వైస్​ చైర్​పర్సన్ పదవి పురుషులకు వెళ్లగా డిప్యూటీ మేయర్​, భీంగల్​లో  వైస్ చైర్​పర్సన్​పోస్టును మహిళలే దక్కించుకున్నారు.  

కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్​ఏర్పడగా ఇండిపెండెట్లు పార్టీలో చేరినా బలం సరిపోకపోవడంతో బీఆర్ఎస్​తో జత కట్టాల్సి వచ్చింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​కు సరిపడా ఓట్లు ఉండడంతో చైర్​పర్సన్​, వైస్​చైర్​పర్సన్​లను దక్కించుకున్నారు.  మున్సిపల్​ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి సవాల్​గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు సక్సెస్​ సాధించి కార్యకర్తల్లో జోష్ పెంచారు.

చివరి నిమిషంలో బోధన్​లో చేంజ్​

మున్సిపల్​ చైర్​పర్సన్​లుగా రెండోసారి ఎన్నికైన దాఖలా జిల్లాలో ఎక్కడాలేదు.  ఆ రికార్డును బోధన్​లో తూము పద్మ సొంతం చేసుకున్నారు. అక్కడి ఓటర్లు హంగ్​ తీర్పునివ్వగా మజ్లిస్ సపోర్ట్​తో కాంగ్రెస్​ చైర్​ పర్సన్​ పదవి దక్కించుకుంది. 26 వార్డ్​ కౌన్సిలర్ అంకు దాము పేరును మొదట పార్టీ డిసైడ్ చేశాక హైదరాబాద్ క్యాంపులో ఉన్న పార్టీ కౌన్సిలర్లందరూ బోధన్ వచ్చారు. ఇంతలో మారిన సమీకరణలతో తూము పద్మ పేరు అనూహ్యరీతిలో తెరపైకి రాగా మజ్లిస్​, కాంగ్రెస్​ కౌన్సిలర్లంతా ఆమోదించారు.  చైర్​పర్సన్ ఎన్నిక ముగిసే దాకా ఎక్స్​ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు.  2020లో ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున చైర్​పర్సన్​గా ఐదేండ్లు పని చేసిన తూము పద్మ ఈసారి జనరల్​ సీటులో కూర్చున్నారు. మజ్లిస్​ కి చెందిన టౌన్ ప్రెసిడెంట్​ మీర్​ఇలియాస్​ అలీ 18వ వార్డు నుంచి గెలిచి వైస్ చైర్​పర్సన్​అయ్యారు.

భీంగల్​లో పోటా పోటీ..

సొంత మండలం భీంగల్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​​గౌడ్​ చక్రం తిప్పారు. అన్​ రిజర్వ్​ మహిళకు కేటాయించిన చైర్​పర్సన్ స్థానాన్ని అక్కడ గెలిచిన నలుగురు కౌన్సిలర్లు ఆశించారు. వారిని సర్దుబాటు చేయడానికి పార్టీ ముఖ్య నేతలు తలపట్టుకున్నారు. చివరకు రాజీ కుదుర్చి బొదిరె నాగమణిని చైర్​పర్సన్​గా సంటి లతను వైస్​ చైర్​పర్సన్​గా ఎన్నుకున్నారు. ఐదేండ్ల పదవీ కాలాన్ని మిగతా ఇద్దరు కౌన్సిలర్లు ఆరెపల్లి శ్రీజ, పర్శ కుశలత పంచుకునేలా నేతలు ఒప్పందం చేసినట్లు సమాచారం.  భీంగల్​ మున్సిపాలిటీ ఏర్పడ్డాక జరిగిన రెండో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. 

2006 తరువాత ఆర్మూర్​లో కాంగ్రెస్​ జెండా..

ఆర్మూర్​ గ్రామ పంచాయతీ 2006లో మున్సిపాలిటీగా మార్చాక జరిగిన మొదటి ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ గెలిచింది. ఆ తరువాత 2014, 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్​ విజయం సాధించింది. ఈసారి జరిగిన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పరిగణించిన పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపిక నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా 20 ఏండ్ల తరువాత అక్కడి మున్సిపాలిటీ కాంగ్రెస్​ సొంతం చేసుకోగా గోనె లహరి చైర్ పర్సన్​గా గెలించారు. వైస్​ చైర్​పర్సన్​పదవి కాటిపల్లి వెంకట్​రెడ్డికి దక్కించుకున్నారు. గత పదేండ్లు జిల్లాలోని నగర పాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు మహిళల ఆధిపత్యం కిందే నడిచాయి. ఇప్పుడు కూడా మరోసారి వారే పాలన నిర్వహించి సత్తా చాటే అవకాశం పొందారు. 

కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్​... 

 కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్​ ఏర్పడింది.  కాంగ్రెస్​కు 19, బీఆర్ఎస్​ 11, బీజేపీ 19, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. ఇండిపెండెంట్లు కాంగ్రెస్​లో చేరగా, ఆ  పార్టీ బలం 22కు చేరింది. చైర్​పర్సన్ పదవికి ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో  కాంగ్రెస్​ , బీఆర్ఎస్ జత కలిశాయి. బీఆర్​ఎస్ సభ్యుల మద్దతుతో  ఇండిపెండెంట్​గా గెలిచి కాంగ్రెస్​లో చేరిన ఇప్ప ఉమారాణికి చైర్​పర్సన్ పదవి దక్కింది. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు స్థానిక అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా  పదవుల విషయంలో అవగాహనకు వచ్చాయి.  కాంగ్రెస్​కు చైర్​పర్సన్​, బీఆర్ఎస్​కు వైస్​ చైర్​పర్సన్​తో పాటు ఒక కో అప్షన్​ పదవి కూడా ఇవ్వనున్నారు.  

చైర్​పర్సన్​గా ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ కి చెందిన కౌన్సిలర్​ ఎండీ ఇషాక్​ మహమ్మద్​ ప్రతిపాదించగా,  అంజాద్​ బలపర్చారు.  బీజేపీ తరఫున ఆ పార్టీ కౌన్సిలర్​ జి.సుజీత పోటీ చేయగా ఈమె పేరును ప్రీతి  గోర్​వత్​ ప్రతిపాదించగా, కాసర్ల రాణి బలపరిచారు. కాంగ్రెస్​ అభ్యర్థికి  33 ఓట్లు , బీజేపీ అభ్యర్థికి ఎక్స్​ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డితో కలిసి 17 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణిని చైర్​పర్సన్​గా ఎన్నికైనట్లు ప్రకటించారు.  వైస్​ చైర్​పర్సన్​కు బీఆర్ఎస్​ నుంచి కాసర్ల గోదావరి ఎన్నికైనట్లు ప్రకటించారు.  

మిగతా 3 చోట్ల ...  

బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్ పదవులను కాంగ్రెస్​  కైవసం చేసుకుంది.  మూడు చోట్ల కాంగ్రెస్ కే మెజార్టీ వచ్చిన దృష్ట్యా ఎలాంటి పొత్తులు లేకుండా పదవులను దక్కించుకుంది.  పార్టీ తరఫున ఆయా చోట్ల ఒక్కొక్కరు మాత్రమే చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్ పదవులకు పోటీ చేయటంతో ఏకగ్రీవమయ్యాయి.  

మహిళలకే 7 పదవులు.. 

జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఛైర్​పర్సన్​, వైస్​ ఛైర్​పర్సన్​ పదవులు మొత్తం 8కి గాను 7 పదవులు కూడా మహిళలకు దక్కాయి.  కామారెడ్డి చైర్​పర్సన్​ బీసీ మహిళకు రిజర్వు కాగా ఇప్ప ఉమారాణికి అవకాశం ఇవ్వగా, వైస్​ చైర్​పర్సన్​ కూడా బీసీ వర్గానికి చెందిన మహిళకే ఇచ్చారు.  బాన్సువాడలో  చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​ 2 పదవులు కూడా మహిళలకు కట్టబెట్టారు. ఎల్లారెడ్డిలో చైర్​పర్సన్​ పదవి అన్​రిజర్వుడు కాగా, ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన పద్మ శ్రీకాంత్​కు చైర్​పర్సన్ పదవి ఇచ్చి వైస్​ చైర్​పర్సన్​పదవిని మహిళకు ఇచ్చారు.  బిచ్​కుంద లో 2 పదవుల్లో మహిళలకే అవకాశం ఇచ్చారు.