కాంగ్రెస్‍ ఖాతాలో 9 మున్సిపాలిటీలు

కాంగ్రెస్‍ ఖాతాలో 9 మున్సిపాలిటీలు
  • మరో మూడుచోట్ల ఎన్నిక నేటికి వాయిదా
  • జనగామ, తొర్రూర్‍లో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నేతల ఎత్తుకు పైఎత్తులు
  • డోర్నకల్​లో కాంగ్రెస్‍లోనే పోటీ 

వరంగల్‍/నెట్‍వర్క్, వెలుగు: ఉత్కంఠ.. ఉత్సాహం.. అడ్డంకులు.. ఆందోళనల మధ్య జరిగిన చైర్​పర్సన్​ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 9 కాంగ్రెస్​ ఖాతాలో పడ్డాయి. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు నిర్వహించగా.. 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‍ మెజారిటీ సాధించింది. సోమవారం చైర్‍పర్సన్‍, వైస్​ చైర్​పర్సన్‍ ఎన్నిక నిర్వహించగా మరో 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 

వర్ధన్నపేట, కేసముద్రంలో..

నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్‍ఘన్​పూర్‍, మరిపెడ, డోర్నకల్‍ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఎక్కువ వార్డులు సాధించింది. మిగతా ఐదుచోట్ల హంగ్‍ ఏర్పడగా.. వర్ధన్నపేటలో ఇండిపెండెంట్‍అభ్యర్థి కాంగ్రెస్‍ లో చేరారు. ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు ఎక్స్​అఫీషియో ఓటుతో మున్సిపాలిటీని కాంగ్రెస్​కైవసం చేసుకుంది. కేసముద్రంలో ఎంపీ బలరాం నాయక్‍ ఎక్స్​అఫీషియో ఓటుతో చైర్​పర్సన్​పీఠం దక్కింది. మహబూబాబాద్‍లో సీపీఎం, ఇండిపెండెంట్లతోపాటు ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎక్స్​అఫీషియో ఓటు కలిసొచ్చింది. 

నేటి ఎన్నికపై ఉత్కంఠ

జనగామ, తొర్రూర్‍ మున్సిపాలిటీల్లో పాలిటిక్స్​రాష్ట్రవాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రెండుచోట్ల బీఆర్‍ఎస్​ ఒకట్రెండు స్థానాలతో ముందంజలో ఉన్నట్లు కనిపించినా.. ఎక్స్​అఫీషియో ఓట్లు, ఇండిపెండెంట్ల మద్దతు కాంగ్రెస్​కు ఉండటంతో ఈక్వేషన్స్​మారుతున్నాయి. చైర్​పర్సన్​పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‍ఎస్‍ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. సోమవారం రెండుచోట్ల ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్‍కే దక్కే అవకాశం ఉన్నా.. చైర్‍పర్సన్‍ పదవి కోసం పార్టీలోనే పోటీ ఉండటంతో వాయిదా పడింది. మంగళవారం నిర్వహించే ఎన్నికపై 
ఉత్కంఠ నెలకొంది.

వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట మున్సిపల్​చైర్​పర్సన్​పదవికి కాంగ్రెస్ కౌన్సిలర్ పాలకుర్తి సారంగపాణి  పేరును ఆ పార్టీకి చెందిన సభ్యుడు మాలోతు దేవేందర్ ప్రతిపాదించగా బెజ్జం పాపయ్య బలపరిచారు. బీఆర్ఎస్ నుంచి బీఫాం సకాలంలో రాకపోవడంతో చైర్​పర్సన్ అభ్యర్థిగా గుజ్జ వీరన్న పేరును స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తూ బానోతు జ్యోతి ప్రతిపాదించగా, చిలువేరు రమ బలపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఐదుగురు, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నేతావత్ షిభారాణి, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చేతులెత్తి ఓటు వేయడంతో సారంగపాణి చైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. 

వైస్ చైర్​పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థి నేతావత్ షిభారాణి పేరును కాంగ్రెస్ కార్పొరేటర్​నూనావత్ కామ్లి ప్రతిపాదించగా.. వాణి తిరుపల్లి బలపరిచారు. బీఆర్ఎస్ సభ్యుల తరఫున వైస్ చైర్​పర్సన్ అభ్యర్థిగా తిరుపతి సురేశ్​ను తుమ్మల అరుణ ప్రతిపాదించగా, బీఆర్ఎస్ నుంచి చిలువేరు కుమారస్వామి బలపరిచారు. షిభారాణికి ఆరుగురు కాంగ్రెస్ సభ్యులతోపాటు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే నాగరాజు ఓటు వేయడంతో వైస్ చైర్​పర్సన్ గా ఎన్నికైనట్లు ఆర్డీఓ సుమ ప్రకటించారు.  

పరకాలలో.. 

పరకాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరగగా.. 5వ వార్డు కౌన్సిలర్​గొడుగు రజిత గైర్హాజరయ్యారు. అనంతరం 7వ వార్డు కౌన్సిలర్ పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్​పర్సన్ ఎన్నిక సుమారు 2 గంటలు ఆలస్యమైంది. వైస్ చైర్మన్ పదవి కోసం పట్టణ అధ్యక్షుడు, 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్, 10వ వార్డు కౌన్సిలర్ పసుల లావణ్య  పోటీ పడగా సీల్డ్ కవర్​లో ఉన్న 4వ వార్డు కౌన్సిలర్ ఏకు దివ్య ఎన్నికయ్యారు. 

ఇదిలా ఉంటే వైస్ చైర్​పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నామని ఆర్డీవో నారాయణ ప్రకటించి, తాము బయటకు వెళ్లాక ఎన్నిక పూర్తి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. ముందు వాయిదా విషయం చెప్పిన మాట వాస్తవమేనని, కానీ బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు డోర్ వద్దకు వెళ్లేలోపే ఎన్నిక ఉంటుందని చెప్పామని ఆర్డీవో పేర్కొన్నారు.  

ములుగులో..

ములుగు మున్సిపల్​చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి భార్య చంద్రకళ, వైస్​ చైర్ పర్సన్​ గా ఆసియా షాహీన్​ మిర్జా ఎన్నికయ్యారు. 20 మంది కౌన్సిలర్లతో ఆర్డీవో వెంకటేశ్​సోమవారం కలెక్టరేట్​లో ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు తమకు కూడా ఫాం ఇవ్వాలని, బరిలో ఉంటామని ఎన్నికల అధికారిని అడగగా.. అవకాశం లేదని, ముందే అప్లై చేసుకోవాలని చెప్పడంతో ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చారు. చంద్రకళను చైర్ పర్సన్ గా కౌన్సిలర్లు పౌడాల ఓంప్రకాశ్, పావని బలపరచగా కౌన్సిలర్లు, మంత్రి సీతక్క చెయ్యెత్తి ఓటు వేశారు. 

భూపాలపల్లిలో..

భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా బుర్రం కొంరయ్యగౌడ్, వైస్ చైర్ పర్సన్ గా అంబాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కొంరయ్యగౌడ్ ను 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్ ప్రతిపాదించగా, 19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ బలపరిచారు. శ్రీనివాస్ ను 30 వార్డు కౌన్సిలర్ బొడ్డు అశోక్ ప్రతిపాదించగా 20 వార్డు కౌన్సిలర్ రాజు నాయక్​ బలపరిచారు. ఆర్డీవో హరికిషన్ 30 మంది కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నిక సమయానికి మున్సిపల్ ఆఫీస్​ కు తీసుకువచ్చారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సన్మానించారు. భూపాలపల్లిలో సమస్యలపై పోరాటం చేస్తామని  పేర్కొన్నారు.