- ప్రమాదాల నివారణకు కలెక్టర్ చర్యలు
- జిల్లాలో 61 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో సమగ్ర చర్యలు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ, మరింత తగ్గించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ చర్యల్లో పోలీస్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌పీడీసీఎల్, రవాణా శాఖ, మున్సిపల్ అధికారులను భాగస్వాములుగా చేసి ఫలితాలపై దృష్టి పెట్టారు.
780 ప్రమాదాలు.. 265 మరణాలు..
ట్రాఫిక్ పోలీసుల సమాచారం ఆధారంగా నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించింది. జిల్లాలో కమ్మర్‌పల్లి నుంచి సాలూరా బ్రిడ్జి వరకు గల ఎన్‌హెచ్-63పై ఈ ఏడాది అత్యధికంగా 26 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాగే దగ్గి అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే ఎన్‌హెచ్-44పై 18 ప్రమాదాలు నమోదయ్యాయి. పోతంగల్, రుద్రూర్, కోటగిరి, బోధన్, బాసర రహదారిపై గల ఎన్‌హెచ్-161 వద్ద ఒక ప్రమాదం, నస్రుల్లాబాద్, -రుద్రూర్ మధ్య ఎన్‌హెచ్ 765పై మరో ప్రమాదం జరిగింది.
వేల్పూర్, భీంగల్, మోర్తాడ్, వర్ని తదితర రాష్ట్ర రహదారులపై 15 ప్రమాదాలు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన780 ప్రమాదాల్లో 265 మంది మృతి చెందగా, 555 మందికి గాయాలయ్యాయి. గత ఏడాది జరిగిన 857 ప్రమాదాల్లో 338 మంది మృతి చెందగా, 518 మంది గాయాలపాలయ్యారు. రానున్న రోజుల్లో ప్రమాదాలను మరింత తగ్గించడానికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు.
ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు..
హైవేలపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి అనుమతి లేకపోవడంతో, బ్లాక్ స్పాట్‌కు 200 మీటర్ల ముందే హెచ్చరిక సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ నెల 19న కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడం, అవసరమైన చోట రోడ్లను వెడల్పు చేయడం, ప్రమాదకర మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలను సరిచేయాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను ఆదేశించారు.
ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగర శివారులోని ఎన్‌ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద గత మూడు సంవత్సరాల్లో 19 మంది మృతి చెందారు. దీంతో అక్కడ కరెంట్ పోల్స్ మార్పునకు చర్యలు చేపడుతున్నారు. రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణకు అనుమతి లభించడంతో యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం
2024తో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో కొంత మేరకు ప్రమాదాలు తగ్గించగలిగాం. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల పూర్తి నివారణే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం. బ్లాక్ స్పాట్స్ పరిస్థితి మెరుగుపడితే మంచి ఫలితాలు వస్తాయి. కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. శనివారం మరో సమీక్షాసమావేశం నిర్వహించారు. – మస్తాన్ అలీ, ఏసీపీ ట్రాఫిక్
