- ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తండ్రి చెబితే కొట్టినట్టా?: రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో సమావేశమై చెప్పిన మాటలు నిజమని, ఆయన ఒకసారి మజ్లిస్ తో కంపేర్ చేయడం కూడా వాస్తవమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘‘మా నాయకుడు మాతో మాట్లాడితే.. దానికి బ్రేకింగ్స్, స్క్రోలింగ్స్ ఎందుకు? తండ్రి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని చెబితే కొట్టినట్టా?’’ అని ప్రశ్నించారు. తమ పార్టీ లీడర్ల ఇండ్లకు తాము భోజనానికి వెళ్తే తప్పేముందని అన్నారు. ఎంపీ అర్వింద్ కొత్త ఇల్లు కట్టారని, భోజనానికి పిలిచారని చెప్పారు.
అలా ఏదైనా అకేషన్ ఉంటే అంతా కలుస్తామన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. “ కేంద్రం ఇచ్చే నిధులపై గ్రామ పంచాయతీలు ఆధారపడ్డాయి. ఇప్పుడు వచ్చే నిధులు15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి. రేపోమాపో 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు మూడేళ్ల డబ్బులు రానున్నాయి. కాంగ్రెస్ ఎన్నికలు పెట్టిందే ఈ నిధుల కోసం. ఉపాధి హామీ పథకంపై ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రానికి కేంద్రం రూ.1,250 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా డబ్బు ఎందుకు ఖర్చు చేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ వచ్చినా మార్పేమీ ఉండదు
బీఆర్ఎస్ లో బావ, బావమరిదితో అవ్వట్లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ను బయటికి తెచ్చారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటకు వచ్చినా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి సభలు పెడుతున్నారని.. డబ్బులు పెట్టినా జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంది తప్పితే ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇంట్లో పంచాయితీతో బీఆర్ఎస్ ప్రమాదంలో పడిందని, అందుకే కేసీఆర్ ను బయటికి తెచ్చారని కామెంట్ చేశారు.
