బీజేపీలో వర్గపోరు.. సూర్యాపేట, నల్గొండలో ముదురుతున్న వివాదం

బీజేపీలో వర్గపోరు.. సూర్యాపేట, నల్గొండలో ముదురుతున్న వివాదం
  • సూర్యాపేటలో సంకినేని వర్సెస్ శ్రీలత రెడ్డి  
  • నల్గొండలో నాగం వర్షిత్​ రెడ్డి, సీనియర్​ నేత పిల్లి రామరాజు యాదవ్​ మధ్య బాహాబాహీ

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షులపై సీనియర్లు తిరుగుబాట మొదలుపెట్టారు. పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ రెండు జిల్లాల్లో బీజేపీకి అనుకున్న స్థాయిలో సర్పంచుల సీట్లు రాకపోవడంపై పార్టీ వైఫల్యం బయటపడింది. ఈ క్రమంలో  కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న సీనియర్ నేతలు జిల్లా అధ్యక్షుల వైఖరితో విసుగు చెంది తిరుగుబాట పట్టారు. 

 సూర్యాపేట జిల్లాలో మొదటి నుంచి జిల్లా అధ్యక్ష ఎంపికపై వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జిల్లాలో  ఏ కార్యక్రమం చేపట్టిన తన వర్గంతోనే నిర్వహిస్తూ ముందుకు సాగుతుండగా నల్గొండ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లకు సన్మానం చేసేందుకు తలపెట్టిన కార్యక్రమం ఇరువ ర్గాల మధ్య దాడులకు దారితీసింది.

నల్గొండలో నాగం పైన సీనియర్లు ఫైర్​ 

నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసుకు వాస్తుదోషం పట్టుకుందనే ప్రచారం మొదలైంది. రెండు టర్మ్​ల నుంచి జిల్లా అధ్యక్షుల పనితీరు పైన పార్టీలో జరుగుతున్న గొడవలే అందుకు నిదర్శనమని సీనియర్లు చెబుతున్నారు. గతంలో కంకణాల శ్రీధర్​ రెడ్డి వ్యవహార శైలి పైన అనేక విమర్శలు వచ్చాయి. దాంతో ఆయనకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన వర్షిత్​ రెడ్డికి మాత్రం రెండోదఫా ఛాన్స్​ దక్కింది. మొదటి దఫాలోనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వర్షిత్​ రెడ్డి పైన తనకున్న ఇమేజ్​తో రెండోసారి అధ్యక్ష పదవి వరించింది. 

దాంతోనే బండారు ప్రసాద్​, మాదగోని శ్రీనివాస్​ గౌడ్, సాంబయ్య తదితరులు వర్షిత్​ను వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇరువర్గాలు కాంప్రమైజ్​అయ్యాయి. అయినప్పటికీ వర్షిత్​ వైఖరిలో మార్పురాలేదని అంటున్నారు. ఆఫీసులోకి తన అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించకపోవడం, ఫ్లెక్సీలు కట్టకుండా ఆంక్షలు విధించడం పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా కార్యక్రమాలు పిలుపునివ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సీనియర్లు చెప్తున్నారు. 

 సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం గురించి పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయించడం వల్ల పోలీసులు తమ ఇళ్లలో చొరబడి నిర్భందించారని, ఇలాంటి చర్యలతో సోషల్​ మీడియాలో ఆయన ఇమేజ్​పెంచుకోవాలనే ప్రయత్నం తప్పా పార్టీకి జరుగుతున్న డ్యామేజ్​ గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.  పార్టీలో ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పడం గొడవలు సృష్టించడం వంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడ ని, ఒకదశలో మాదగోని శ్రీనివాస్​గౌడ్, రామరాజు మధ్య గొడవలు సృష్టించే కుట్ర కూడా చేసిండని చెప్తున్నారు. సోషల్​ మీడియాలో స్టేటస్​లు, పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సు కోసం కాకుండా తన సొంత ఇమేజ్​ కోసం వైరల్​ చేస్తారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో  30 వేల ఓట్లు సంపాదించి, అప్పుడున్న అధికార పార్టీని కాదని బీజేపీలో చేరితే బీసీ నేతగా తనను అవమానిస్తున్నారని, పార్టీలో నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు బలమైన సామాజిక వర్గం లీడర్లు ఏకమై కుట్ర పన్ను తున్నారని రామరాజు వర్గీయులు చెప్తున్నారు.  ఈ క్రమంలో గురువారం పిల్లి రామరాజు దాడి నేపథ్యంలో వర్షిత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం బీసీ నేతలు ఆందోళనకు దిగారు.  ఈ వ్యవహారం ఎంత వరకు దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.

సూర్యాపేటలో ఎవరికి వారే

సూర్యాపేట జిల్లాలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తూ రోజురోజుకూ వర్గపోరు మరింత రాజుకుంటోంది. జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొదటి నుంచి చల్లా శ్రీలత రెడ్డిని ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయడం వ్యతిరేకిస్తున్న సంకినేని వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన రెండు వర్గాలు ఎవరికి వారే నిర్వహిస్తున్నారు.  మొదట్లో రెండు సార్లు కలిసిన శ్రీలత రెడ్డి ఆ తర్వాత సంకినేనికి సమాచారం ఇవ్వకుండానే సూర్యాపేట నియోజకవర్గంలో కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలే ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. 

దీంతో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంకినేని సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో బీజేపీ మద్దతు అభ్యర్థులను గెలిపించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్‌‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం తిరిగి బీఆర్‌‌ఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి వ్యవహారమే కారణమని ఆ పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.