గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం తేవాలి.. గృహ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి

గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం తేవాలి.. గృహ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి
  •     ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ముషీరాబాద్, వెలుగు: గృహ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. దలిత్​ బహుజన్​ ఫ్రంట్(డీబీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గృహ కార్మికుల జాతీయ దినోత్సవం నిర్వహించారు. 

ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేక కుటుంబాలు పట్టణాలకు వలస వస్తున్నాయని, మహిళలు గృహ కార్మికులుగా, పురుషులు వాచ్‌‌మెన్‌‌లుగా పనిచేస్తూ అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గిగ్ కార్మికులకు చట్టం తీసుకొచ్చినట్లే, గృహ కార్మికుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్​ మాట్లాడుతూ.. గృహ కార్మికులకు కనీస వేతనాలు లేక, సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, సామాజిక భద్రత కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు రాజేశ్, కృష్ణ, యాదమ్మ, శారద, మీనా, రంగమ్మ, సుధాకర్, రవి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.