దశరథ రాముడా? రామ నారాయణుడా?.. భద్రాద్రి రాములోరిపై తెగని పంచాయితీ

దశరథ రాముడా?  రామ నారాయణుడా?.. భద్రాద్రి రాములోరిపై తెగని పంచాయితీ
  • గోత్రం, ప్రవర వివాదంపై  నేడు హైకోర్టులో విచారణ
  • 2022లో హైకోర్టులో పిటిషన్‌‌
  • ఐదుగురు పండితులతో కమిటీ వేసిన కోర్టు
  • 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ
  • కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి
  • కల్యాణ విధులకు ప్రధాన 
  • అర్చకుడిని దూరం పెట్టాలని భక్తుల డిమాండ్

 

హైదరాబాద్, వెలుగు: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం సమీపిస్తున్న వేళ మరోసారి స్వామివారి గోత్ర నామాల వివాదం తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా? లేక వైకుంఠ రామ నారాయణుడా? అనే అంశంపై సుదీర్ఘ కాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీతారాముల గోత్రం, ప్రవర మార్చేశారన్న ఆరోపణలున్నాయి. దశరథ రామున్ని రామనారాయణుడిగా మార్చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి గోత్ర, నామాల వివాదంపై సోమవారం హైకోర్టులో  విచారణ జరగనుంది. భద్రాచలంలో 2012 వరకు శ్రీరాముడిని దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రోద్భవుడిగా పూజించేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. సీతమ్మవారిని గౌతమస గోత్రంగా వ్యవహరించేవారు. కానీ, 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని.. ఆయన రామనారాయణుడంటూ గోత్రం, ప్రవరలను మార్చి చదువుతున్నారనేది ప్రధాన ఆరోపణ. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని.. ప్రవరగా ఆదినారాయణాయ, నిరాకార, సాకారమంటూ ఆది దేవుడి పేరిట చెప్తున్నారు. సీతాదేవి గోత్రం కూడా లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్యగా చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవి ప్రవరే.  ఇక్కడే పండిత వర్గం రెండుగా విడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, శతాబ్దకాలంగా చల్లా లక్ష్మీనరసింహశాస్త్రి రాసిన సీతారామ కల్యాణోత్సవ ప్రయోగానుక్రమణిక గ్రంథం ప్రకారం జరుగుతున్న తంతును మార్చడం ధార్మిక శాస్త్రాలకు విరుద్ధమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టులో వివాదం.. 

నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చేనా? 

భద్రాద్రి రామయ్యకు సంబంధించిన ఈ అంశంపై 2022లో హైకోర్టులో కేసు నమోదైంది. వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు న్యాయస్థానం ఐదుగురు పండితులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి 2024లో దేవాదాయ శాఖకు తన నివేదికను సమర్పించింది. అయితే, ఆ నివేదికను దేవాదాయశాఖ బయట పెట్టకపోవడంతోపాటు కోర్టుకు సమర్పించలేదు. దీనిపై పిటిషనర్ కంచర్ల వెంకటరమణ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో ఉన్నత న్యాయస్థానం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్​కు  నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణలో పండితుల కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పండితులు 
పేర్కొంటున్నారు. 

ప్రధాన అర్చకుడిని తొలగించాలని డిమాండ్

భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు భక్తుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కోడలి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు కావడం, అనంతరం ప్రభు త్వం ఆయనను సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆయన దత్తపుత్రుడిపై కూడా దేవాదాయ శాఖ అధికారులు సస్పెన్షన్‌‌‌‌ వేటు వేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీతారాముల కల్యాణం జరిపించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చేతుల మీదుగా స్వామివారి కల్యా ణం జరగడం శాస్త్ర సమ్మతం కాదని, ఆయనను కల్యాణ విధులకు పూర్తిగా దూరం పెట్టాలని అఖిల భారత శ్రీరామ భక్త సేవా సంఘం డిమాండ్ చేస్తోంది. 

అయితే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మార్పులు భద్రాద్రి రాముడి విశిష్టతను దెబ్బతీసేలా ఉన్నాయని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా, పురాతన సం ప్రదాయాల ప్రకారమే కల్యాణ వేడుకలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు. అయితే, శ్రీరామనవమికి ముందే ఈ వివాదం కొలిక్కి వస్తుందా? మళ్లీ విచారణ వాయిదా పడుతుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.