
ఊర్లలోకి చేరిన మిడ్ మానేరు బ్యాక్ వాటర్
ఆందోళనలో నిర్వాసిత గ్రామాలు
విచారణకు వచ్చిన తహసీల్దార్ నిర్బంధం
వేములవాడ, వెలుగు: మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయామని, పరిహారం ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేరలేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్కున్న తమ ఇండ్లు, భూముల పరిహారం కోసం అధికారుల కాళ్లావేళ్లా పడినా న్యాయం జరగట్లేదంటున్నారు. భూములు, ఇండ్లు లాక్కునేటప్పుడు మీ కాళ్లు కడిగి నెత్తిన పోస్కోవాలి, అన్ని లెక్కల ప్రకారం వెంటనే పరిహారం పైసలు ఇస్తమని ప్రభుత్వ పెద్దలు చెప్పారని, కొంతమందికి మాత్రమే ఇచ్చి మరికొంతమందికి ఇప్పటికీ పరిహారం ఇవ్వకుండానే మా ఇండ్లు, జాగలను మిడ్ మానేరు బ్యాక్ వాటర్ తో ముంచేశారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
ఇప్పటికీ పరిహారం అందలె
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మన్వాడ దగ్గర మానేరుపై 25.873 టీఎంసీల సామర్థ్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు కింద 12 గ్రామాలు పూర్తి స్థాయిలో నీట మునిగిపోగా.. 7 గ్రామాలు పాక్షికంగా భూములు కొల్పోయాయి. నిర్వాసిత గ్రామాల్లో నోటిఫై చేసిన చాలా ఇండ్లకు ఇప్పటికీ పరిహారం అందలేదు. అధికారులు చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 22 టీఎంసీల టార్గెట్ తో పది రోజుల నుంచి వరద కాలువ ద్వారా నీళ్లు నింపుతున్నారు. దీంతో మానేరు బ్యాక్ వాటర్ పెరిగి పరిహారం అందని గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. వేములవాడ మండలం సంకెపల్లి లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గ్రామంలో నోటిఫై చేసిన ఇళ్లను అనుకునే వరకు బ్యాక్ వాటర్ చేరుకుంది. దీంతో వాళ్లంతా ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంకెపల్లిలో 358 ఇండ్లుండగా నోటిఫై చేసిన ఇండ్లు148. అందులో 13 మందికి పరిహారం అందలేదు. నోటిఫై కాని మరో 20 ఇండ్ల వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి.
నోటిఫై కాని ఇండ్లకూ నష్టమే
మిడ్ మానేరులో 22 టీఎంసీల నీళ్లు చేరుకునే సరికే పరిస్థితి ఇలా ఉంటే పూర్థి స్థాయిలో నింపితే సంకెపల్లిలో దాదాపు 50 నోటిఫై కాని ఇండ్ల వరకు నీట మునిగే ప్రమాదం ఉంది. అరెపల్లి గ్రామంలో 2009లో 183 ఇళ్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫై చేసి పట్టాలు ఇచ్చింది. రూ. 53 వేలు పరిహారం అందజేసింది. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక 65 ఇళ్లను నోటిఫై చేసింది. వాటికి ఇప్పటికీ పరిహారం రాలేదని గ్రామస్థులు చెప్తున్నారు. ఇప్పటికే ఇందులో 30 ఇళ్లు నీట మునిగాయని, మానేరు పూర్తిగా నింపితే మిగతా ఇళ్లన్నీ మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. రుద్రవరంలో గ్రామంలోని మొత్తం ఇళ్లను(913) నోటిఫై చేశారు. అందులో 46 మందికి పరిహారం రాకుండా ఆ గ్రామం నీళ్లలో మునిగిపోయింది. కొడుముంజ గ్రామంలో 560 నోటిఫై చేయగా ఇంకా ఇళ్ల పరిహారం రాకుండానే 10 ఇళ్ల నీట మునిగిపోయాయని తెలిపారు. ఇంకా నోటిఫై కానివి మరో 30 ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. అనుపురంలో మొత్తం 730 ఇండ్లకు గాను 673 వరకు నోటిఫై చేసి పరిహారం అందించగా, మిగతా 57 ఇండ్లకు పరిహారం అందకుండానే నీళ్లలో మునిగిపోయాయని గ్రామస్థులు చెప్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పాములు, క్రిమికీటకాలతో ఇబ్బందులు
మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ఇళ్ల దగ్గర్లోకి చేరుకోవడంతో పాములు, ఇతరత్రా పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటయితే చాలు.. ఏ మూలనుంచి ఏ పాము ఇంట్లకొస్తదో అని చూడాల్సి వస్తోందని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అరెపల్లిలో 20 వరకు ప్రమాకరమైన విష పాములను చంపేశామని చెప్తున్నారు.
తహసీల్దార్ నిర్బంధం
మిడ్ మానేరు బ్యాక్ వాటర్ సంకెపల్లి గ్రామంలోని నోటిఫై కాని ఇళ్ల దగ్గర్లోకి చేరిందన్న సమాచారంతో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రామాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంలో తమకు న్యాయం చేయాలని, పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు అధికారులు వేడుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీరుస్తామని వారు చెప్పారు. కానీ, అప్పటికప్పుడు పరిష్కారం చూపించాలంటూ గ్రామస్థులంతా కలిసి అధికారులను నిర్బంధించారు. వెంటనే అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు దీనిపై స్థానిక ఎమ్మెల్యేకు తెలపగా త్వరలోనే సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో గ్రామస్థులు అధికారులను వదిలిపెట్టారు.
పూర్తి విచారణ చేసి రిపోర్టిస్తం
మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వచ్చిందని తెలియగానే వెళ్లి పరిశీలించాం. అందులో ఎన్ని ఇళ్లు మునుగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఎంత ప్రమాదం ఉంటుంది అనే విషయాలపై ప్రభుత్వానికి రిపోర్టు చేస్తాం. గ్రామస్థుల అవేదనను అర్థం చేసుకున్నం. నోటిఫై చేసిన ఇళ్లకు వెంటనే పరిహారం అందించేందుకు ఉన్నత అధికారులకు నివేదిస్తాం.
– శ్రీనివాస్, తహసీల్దార్, వేములవాడ
మేమెక్కడికి పోవాలె?
మా ఇంటికి ఆనుకునే వరకు నీళ్లొచ్చాయి. రేపటికల్లా మొత్తం ఇళ్లు మునిగేట్టుంది. మాకు పైసల్ మాత్రం ఇంకా ఇయ్యలే. మేమేం చెయ్యాలి. ఇంట్ల సామాను సర్దుకున్నం. ఎక్కడికి పోవాలె? అయ్యా మాకు ఇళ్ల పైసలు ఇప్పియుర్రి. దండం పెడ్త.
– జింక నర్సవ్వ, సంకెపల్లి
50 ఇండ్లు మునుగుతయ్
మిడ్ మానేరులో 22 టీఎంసీలకే గ్రామం చుట్టూ నీరు చేరింది. నోటిఫై చేయని ఇళ్లలోకి సైతం బ్యాక్ వాటర్ వచ్చింది. పూర్తిగా 25 టిఎంసీలు నింపితే మాత్రం మా ఊల్లో 50 ఇళ్లు మునిగిపోతయ్. తహశీల్దార్ వచ్చారు విచారణ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి.
– జింక వేణు, మాజీ ఉప సర్పంచ్, సంకెపల్లి.