
- మురుగు ప్రాంతాల నుంచి వచ్చారని నిరాకరణ
ఎల్ బీ నగర్, వెలుగు: హైదరాబాద్లోని లోతట్టు కాలనీల ముంపు బాధితులకు తలదాచుకోవడానికి చోటు దొరకడం లేదు. ఇండ్లల్లోకి వరద, మురుగు చేరడంతో సామానుతో రోడ్డెక్కుతున్న కుటుంబాలకు ఇండ్లు కిరాయికి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మురుగు ప్రాంతాల నుంచి వచ్చారు.. మీకు ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని కొందరు ఓనర్లు అంటుంటే.., నెల, రెండు నెలల కోసం ఇల్లు కిరాయికి ఇవ్వలేమని మరికొందరు తేల్చి చెబుతున్నారు. దీంతో వరద బాధితులు గూడు చెదిరిన పక్షుల్లా.. ఎటూ వెళ్లలేని దిక్కుతోచన స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు హైదరాబాద్మహానగరంలో లోతట్టు కాలనీలు నీట మునిగాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగి ఇండ్లలోకి నీరు చేరింది. నాగోల్ డివిజన్ అయ్యప్ప నగర్ కాలనీ వాసులు ముంపు సమస్యతో సమానుతో రొడ్డెక్కారు. ఏ కాలనీకి వెళ్లినా వీరికి ఉండటానికి ఇల్లు దొరకడం లేదు. సిటీలోని చాలా లోతట్టు కాలనీల ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇండ్లు ఇస్తలేరు...
వానాకాలం వచ్చిందంటే ఎక్కడ వరద వస్తుందోనన్న భయంతో బతకాల్సి వస్తోందని అయ్యప్పనగర్ కాలనీవాసి అంజయ్య అన్నారు. మొన్నటి నుంచి పడుతున్న వానలకు ఇంట్లోకి నీళ్లొచ్చాయని ఆయన వాపోయారు. సామాను సర్దుకొని బయటికొచ్చి కిరాయి కోసం ఇల్లు వెతుకుతున్నామన్నారు. మురికి నుంచి వచ్చారంటూ ఎవరూ ఇల్లియ్యట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.