వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు

వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు

దేశ రాజధాని ఢిల్లీ వర్షానికి వణికిపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ గాలులకు చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో ఉదయం 5 గంటల సమయంలో ఓ ఇళ్లు కూలిపోయిందని సమాచారం. అందులో చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించారు. జ్యోతి నగర్ ప్రాంతంలో ఉదయం 6 గంటల సమయంలో ఇదే ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని చిక్కుకున్న వారిని రక్షించారు. సెంట్రల్ ఢిల్లీలోని శంకర్ రోడ్డు ప్రాంతంలో ఓ ఇళ్లు కూలిపోవడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ఉదయం 6.36 గంటలకు మరో ఇళ్లు నేలమట్టమైందని సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ సహాయక చర్యలు చేపడుతున్నారు. 

2022, మే 23వ తేదీ సోమవారం ఉదయం గంటన్నర పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా.. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు విమానాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. 29 డిగ్రీలుగా నమోదైంది. గత కొన్ని రోజులుగా ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు కొంత ఉపశమనం పొందారు.


మరిన్ని వార్తల కోసం :-

ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే


వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి