
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించడంతో నిర్మాణ సామగ్రి వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుండగా సిమెంట్, ఇటుక, స్టీల్ లబ్ధిదారులే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల లబ్ధిదారులకు నిర్మాణం భారంగా మారనుంది. వ్యాపారులు ధరలు పెంచారని లబ్ధిదారులు స్థానిక ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా... జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్‌కు దృష్టికి తీసుకెళ్లారు.
మరో వైపు తాపీ మేస్త్రీలు కూడా లేబర్ చార్జీలు పెంచడంతో పాటు తమ గ్రామాల్లో నిర్మాణం చేపట్టాడానికి ఇతర గ్రామాల నుంచి మేస్త్రీలు రాకుండా అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, లేబర్ ఆఫీసర్, హౌసింగ్ ఇంజనీర్లతో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ. వీపీ గౌతమ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎంపీడీవోల స్థానంలో మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధరల నియంత్రణతో పాటు సంబంధిత నిర్మాణ సామగ్రి సరఫరాను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. అదేవిధంగా ఇసుక సరఫరాలో కూడా ఏమైనా అడ్డంకులు ఉన్నట్లయితే ఈ కమిటీ తగిన పరిష్కారం చూపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.