బడ్జెట్ పై ప్రభుత్వానికి హౌసింగ్ ఆఫీసర్ల ప్రతిపాదనలు

బడ్జెట్ పై ప్రభుత్వానికి హౌసింగ్ ఆఫీసర్ల ప్రతిపాదనలు
  • ‘డబుల్ ఇండ్ల’కు రూ.8వేల కోట్లు,
  • ‘సొంత జాగాలో ఇల్లు’కు 10 వేల కోట్లు అవసరం

హైదరాబాద్, వెలుగు: ఇండ్లు లేనివారికి ఆవాసం కల్పించడంపై ప్రభుత్వం హామీ ఇచ్చిన స్కీముల అమలుకు రూ.18వేల కోట్లు అవసరమని ఆ హౌసింగ్ ఆఫీసర్లు బడ్జెట్​ప్రతిపాదన పెట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పూర్తికి రూ.8 వేల కోట్లు, ‘సొంత జాగాలో ఇల్లు’ స్కీమ్ అమలుకు రూ.10వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ రెండు స్కీమ్ ల అమలుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు అందజేశారు.

నిధులు రిలీజ్ చేయలే 

సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ఇందుకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అయితే మరో రెండు నెలల్లో ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి అవుతున్నా ఇంత వరకు స్కీమ్ ను ప్రభుత్వం స్టార్ట్ చేయలేదు. గత నెలలో మహబూబ్ నగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ త్వరలో స్కీమ్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. అయితే నిధుల కొరత వల్ల ఇంత వరకు పథకం ప్రారంభించలేదు.

ఎన్నికల ఏడాది

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయని జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘సొంత జాగాలో ఇల్లు’ స్కీమ్ ను స్టార్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాకపోవటం, పూర్తయిన ఇండ్లు పంపిణీ చేయకపోవటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇపుడు ఈ స్కీమ్ స్టార్ట్ చేయకపోతే వ్యతిరేకత మరింత పెరగనున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి కనీసం1000  మందికి సాయం అందించినా వ్యతిరేకత కొంత తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది బడ్జెట్ లో ఈ స్కీమ్ కు రూ.12 వేల కోట్లు కేటాయించినా ఇంత వరకు స్కీమ్ స్టార్ట్ చేయలేదు. మరో రెండు నెలల్లో ఫైనాన్సియల్ ఇయర్ పూర్తవుతున్నందున మార్చి 31 లోపే స్కీమ్ ను స్టార్ట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.