రాజీవ్ స్వగృహ టార్గెట్ 900 కోట్లు

రాజీవ్ స్వగృహ టార్గెట్ 900 కోట్లు

 

  • బండ్లగూడ, పోచారం ఫ్లాట్ల అమ్మకంతో అంచనా
  • దశలవారీగా ఖాళీ జాగాల సేల్​
  • భూముల లెక్క తేలుస్తున్న హౌసింగ్ అధికారులు
  • ఫ్లాట్లకు ఇప్పటి వరకు 30 వేల అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకంతో సుమారు రూ.900 కోట్లు వస్తాయని హౌసింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లాట్లకు మే12 న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 14తో ముగియనుంది. ఇప్పటి వరకు 30 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 14 నాటికి మరో 5 వేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నరు. దరఖాస్తుల రూపంలోనే రూ. 3 కోట్లు (నాన్ రిఫండబుల్) సర్కారు ఖజానాకు చేరాయి. రెండు చోట్ల సింగిల్, డబుల్, త్రిబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్లను అధికారులు అమ్మకానికి ఉంచారు.  ఒక్కో చదరపు అడుగుకు రూ.3000, రూ.2750 ధర ఖరారు చేశారు.  బహిరంగ మార్కెట్ తో పోలిస్తే రాజీవ్ స్వగృహ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సింగిల్ బెడ్ రూమ్ రూ.18 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ రూ.35 లక్షలు, త్రిబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.50 లక్షల లోపే వస్తుండటంతో కొనుగోలు దారుల నుంచి భారీ స్పందన వస్తోంది.

ఇక జాగాల వంతు

అపార్ట్ మెంట్లకు మంచి స్పందన వస్తుండటంతో హౌసింగ్ డిపార్ట్ మెంట్, కార్పొరేషన్​కు ఉన్న ఖాళీ జాగాలు అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉన్నాయన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేసులు, వివాదాలు లేకుండా ఉన్న ఖాళీ జాగాలను ముందుగా వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేల కోట్లను ఆర్జించాలని భావిస్తోంది.