మూడు పార్టీల విలీనం : కె. రమ

మూడు పార్టీల విలీనం :  కె. రమ

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైంది. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు గురించి కూడా వివాదం వుంది. కొందరు 1920లో తాష్కెంట్లో ఏర్పడిందని భావిస్తుండగా, మరికొందరు 1925లో కాన్పూర్​లో  ఏర్పడిందని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిశాయి. కార్మికవర్గం సంఘ నిర్మాణాల్లో సంఘటితం అయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,  వాయలార్ పోరాటం, వర్లీ పోరాటం తదితర పోరాటాలు ముందుకొచ్చాయి. ఫలితంగా భూసంస్కరణల చట్టం వచ్చిందని మనం మరవరాదు.

తెలంగాణ సాయుధ పోరాటంలో 3 వేల గ్రామాలు విముక్తయ్యాయి. లక్ష ఎకరాల భూపంపకం జరిగింది. 5వేల మంది అమరులయ్యారు. తెలంగాణా పోరాటాన్ని 1951లో విరమించారు. అనంతరం 1952లో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 77 స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. 42 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాట నాయకుల్లో ఒకరైన రావి నారాయణరెడ్డి, నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిచారు. పార్లమెంటులో కూడా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 

1957లో కేరళలో అత్యధిక సీట్లు సంపాదించి కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చింది. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ భ్రమలకు గురైంది.  పార్టీలో పెద్దయెత్తున విభేదాలు తలెత్తాయి. 1964లో పార్టీ రెండుగా విడిపోయింది. సీపీఐ, సీపీఎంగా పార్టీలు ఏర్పడ్డాయి. ఆ తరువాత పశ్చిమ బెంగాల్లో బంగ్లా కాంగ్రెస్​తో  జతకట్టి 1967లో సీపీఎం అధికార పగ్గాలు చేబూనింది. అదే సంవత్సరం నక్సల్బరీలో రైతులు భూపోరాటం చేశారు. రైతులపై కాల్పులు జరిగాయి. ఆ పోరాటాన్ని ప్రభుత్వం పాశవికంగా అణచివేసింది.

విప్లవ పార్టీల అవతరణ

సీపీఐ నుంచి సీపీఎం చీలిపోవడం. అవే ధోరణులు మరింతగా వ్యక్తమయ్యాయి. దానితో 1969లో విప్లవ కమ్యూనిస్టులు విడిపోయారు. సీపీఐ (ఎంఎల్.) పార్టీని నిర్మాణం చేసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైతే, విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 55 సంవత్సరాలైంది. అయినా విప్లవోద్యమం ముందుకెళ్ళలేదు సరికదా! ఇంకా వెనుకపట్టు పట్టిందని, స్తబ్ధతకు గురైందని చెప్పక తప్పదు. 

రష్యాలో 1898లో బోల్షివిక్ పార్టీ ఏర్పడితే 1917కల్లా విప్లవాన్ని విజయవంతం చేసుకుంది. చైనాలో 1921లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడితే 1949 కల్లా అంటే 28 సంవత్సరాల్లో కామ్రేడ్​ మావో నాయకత్వంలో విజయవంతం చేసుకున్నారు. అవి ఈ రోజు సోషలిస్టు రాజ్యాలుగా ఉన్నాయా? లేవా? అనేది వేరే అంశం. కర్ణుడి మరణానికి అనేక కారణాలన్నట్లుగా ఆయా దేశాల్లో అధికారాన్ని కోల్పోవడానికి అనేక కారణాలున్నాయి.

నూరేండ్ల కమ్యూనిస్టు పార్టీ 

మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి నూరేండ్లు అయినా ముందుకు వెళ్ళలేక పోవడానికి కారణాలేమిటనేది సీరియస్ చర్చ జరపాల్సి వుంది. నేడు మన దేశంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు మూడు పంథాలను అనుసరించడమే దీనికి కారణం. సీపీఐ, సీపీఎం ఇరుపార్టీలు పార్లమెంటరీ పంథా అనుసరించగా, వాటి నుండి విడిపోయిన విప్లవకారులు మరో కొసకు కొట్టుకుపోయి అతివాద పంథా మార్గాన్ని ఎంచుకున్నారు. 

దేవులపల్లి వెంకటేశ్వరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్యలు అతివాద పంథా నుంచి విడివడి మధ్యే మార్గం ఎంచుకున్నప్పటికీ పూర్తిగా   దాని నుంచి బయటపడలేదనేది ఒకవాస్తవం. భారతదేశంలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేయడంలో,  దేశానికి వర్తించే కార్యక్రమాన్ని, పంథాను రూపొందించుకోవడంలో విఫలమయ్యాయని చెప్పక తప్పదు. విప్లవ పార్టీలు సైతం 1969లో ఎంచుకున్న మార్గాన్నే అవలంబిస్తున్నాయి తప్పితే దేశంలో వస్తున్న మార్పులను గుర్తించడంలో విఫలమయ్యాయి.

‘మాస్​ లైన్’ పేరుతో ఐక్యం

భారతదేశంలో అర్థవలస, అర్థభూస్వామ్య స్థితి స్థానంలో పెట్టుబడిదారీ విధానం పెరుగుతోందని సుమారు 40 సంవత్సరాల నుంచి న్యూ డెమోక్రసీ పార్టీలో అంతర్గత పోరాటం జరిగింది. కానీ, నాయకత్వం ఈ మార్పులను గుర్తించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 22న న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి విడివడి ప్రజాపంథా పార్టీ ఏర్పడింది. 

ఆ తరువాత భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం పెరుగుతోందని భావించే వివిధ పార్టీలతో చర్చలు జరిపింది. సంవత్సర కాలం చర్చల అనంతరం సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ, సీపీఐ (ఎంఎల్) రివల్యూషనరీ ఇనీషియేటివ్ పార్టీ,  పీసీసీ సీపీఐ (ఎంఎల్) మూడు పార్టీలు 'మాస్ లైన్' పేరుతో ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయి. ‘ప్రజాపంథా’ ఇప్పటి నుంచి 15 రాష్ట్రాల నిర్మాణంలో ఆలిండియా పార్టీగా అవతరించనుంది. పై మూడు పార్టీల విలీన సభ మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో జరగనుంది. మొదటిరోజు మార్చి 3న భారీ ప్రదర్శన, భారీ బహిరంగ సభ జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే 300 మంది ప్రతినిధులతో 4,5 తేదీలలో మహాసభ జరుపుకొని, నూతన కార్యక్రమాన్ని రూపొందించుకొని, నూతన కర్తవ్యాలను చేపడుతుంది.

- కె. రమ
రాష్ట్ర కార్యదర్సి వర్గ సభ్యులు,
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా