
జగిత్యాల టౌన్, వెలుగు: నవ మాసాలు మోసింది.. ప్రాణాలను పనంగా పెట్టి భూమి మీదకు తెచ్చింది.. లాలించి.. పెంచి పెద్ద చేసిన ఆ తల్లిని భారంగా భావించారు ఆ కొడుకులు.. ఎన్నో ఆశలతో సాకిన ఆ మాతృమూర్తికి చేతకాని వయస్సు వచ్చాక వదిలించుకొవాలని చూసారు.. గోరు ముద్దలు తిని పించిన ఆమెకు బుక్కెడు బువ్వ పెట్టలేక పోయారు.. కంటికి రెప్పగా కాపాడిని అమ్మను అవసాన దశలో చేరదీయాల్సింది పోయి.. నిర్మాణుష్య ప్రాంతంలో పది రోజుల క్రితం వదిలేసి వెళ్లిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
జిల్లా కేంద్రానికి కొన్ని ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వెంకటమ్మ కుటుంబం వలస వచ్చారు. భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులు కొమురయ్య, వెంకటయ్యలకు వివాహం చేసి.. ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని పంచి ఇచ్చింది. వయస్సు మీద పడటంతో పని చేయలేక ఇంటి వద్ద ఉంటున్న వెంకటమ్మను నెల చొప్పున ఒకరు పోషించాలని కొడుకులు నిర్ణయించుకున్నారు. గత కొన్ని నెలల నుంచి వెంకటమ్మకు ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోవడంతో మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలో ఆమెకు సేవలు చేయలేక కొడుకులు స్థానిక టీఆర్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పది రోజుల క్రితం వదిలేసి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి అక్కడ పక్కనే ఉంటున్న స్థానికులు ఎవరైనా అటు వైపు వెళితే నీళ్లు.. పండ్లు ఇస్తే.. అదే మంచంలో తినేస్తూ.. బతుకెళ్లదీస్తుంది. పది రోజులుగా అక్కడే ఉండటంతో శరీరానికి పూర్తిగా చీమలు పట్టాయి. అక్కడే తిన్న తినుబండారాలు ఉండటంతో ఈగలతో అవస్థలు పడుతున్న పరిస్థితి.. స్థానికులు ఆ తల్లి దుస్థితిని చూడలేక గుడిసె వేసి.. తాటిపత్రి కట్టి తమ ఊదారత చాటుకున్నారు. ఆధికారులు స్పందించి వెంకటమ్మను చేరదీసి కొడుకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.