ధోనీతో పోలికే అతణ్ని దెబ్బ తీసింది

ధోనీతో పోలికే అతణ్ని దెబ్బ తీసింది

పంత్ పెర్ఫామెన్స్ పై ఎమ్మెస్కే కామెంట్స్

న్యూఢిల్లీ: యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు టీమిండియా చాలా చాన్సెస్ ఇచ్చింది. కెరీర్ మొదట్లో సక్సెస్ అయిన పంత్.. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. టీమ్ మేనేజ్ మెంట్ చాన్సెస్ కల్పించిన్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంత్ ఫెయిల్యూర్ పై మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నీడలో నుంచి పంత్ బయట పడాలని ఎమ్మెస్కే సూచించాడు. అప్పుడే అతడు మరింత మెరుగైన ప్లేయర్ గా మారతాడన్నాడు. ధోనీతో పోల్చడంతో పంత్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడిందనే విషయాలను ప్రసాద్ వివరించాడు. ఇప్పటికైనా దాని నుంచి అతడు బయట పడాలని, మెరుగ్గా ఆడాలన్నాడు.

‘మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారి పంత్ ను ధోనీతో పోల్చేవారు. దాంతో పంత్ భ్రమకు లోనయ్యేవాడు. దీని నుంచి బయట పడాలని పంత్ కు పలు మార్లు సూచించాం. మాహీది వినూత్న వ్యక్తిత్వం. అతడితో పోలిస్తే నీది విభిన్నమైన వ్యక్తిత్వం అని పంత్ కు చెప్పాం. పంత్ కూడా అద్భుతమైన ప్లేయరే. ఈ విషయాన్ని అతడితో మాట్లాడుతూ వివరించాం. అతడికి ప్రతిభ ఉంది కాబట్లే మేం అండగా నిలిచాం. అతడెప్పుడూ ధోని నీడలో ఉండేవాడు. అతడు తనను ధోనీతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. ధోనీని కాపీ చేస్తూ ఉండేవాడు. మేనరిజమ్స్ లో కూడా అతణ్ని అనుకరించేవాడు. అదృష్టవశాత్తూ ధోని రిటైర్ అయ్యాడు. ధోని నీడలో నుంచి పంత్ బయటికొచ్చి మెరుగ్గా ఆడతాడని ఆశిస్తున్నా. టెస్టుల్లో ఆస్ట్రేలియాలో కంగారూ టీమ్ పై సెంచరీ, ఇంగ్లండ్ గడ్డపై బ్రిటిష్ జట్టు మీద హండ్రెడ్ కొట్టిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్ పంత్. దీన్ని బట్టి అతడిలో ఎంత ప్రతిభ దాగి ఉందో అంచనా వేయొచ్చు’ అని ప్రసాద్ పేర్కొన్నాడు.