లోపలి విషయాలు బయటపెడితే ఎట్ల?

లోపలి విషయాలు బయటపెడితే ఎట్ల?

శ్రీశైలం ప్లాంట్ ఇంజనీర్లపై ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ఆగ్రహం!

అచ్చంపేట/నాగర్ కర్నూల్, వెలుగు: ఇంటర్నల్​ విషయాలను ఎందుకు బయట పెడుతున్నారని శ్రీశైలం పవర్​ ప్లాంట్​ ఇంజనీర్ల వద్ద ట్రాన్స్​కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్​రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంటి గుట్టు రట్టు చేసేలా కొందరు బయటకు లీకులు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్లాంట్​లో ప్రమాదానికి సీనియర్​ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమని కొంతమంది ఇంజనీర్లు మంగళవారం సంతాప సభ సందర్భంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇది మీడియాలో ప్రముఖంగా రావడం ప్రభుత్వాన్ని , జెన్ కో సీనియర్​ ఆఫీసర్లను కలవర పెట్టింది. ఈ అంశంపై కొందరు సీనియర్ ఇంజినీర్ల వద్ద ప్రభాకర్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బుధవారం ఆయన పవర్​ప్లాంట్​ను పరిశీలించారు. ఫైర్​ యాక్సిడెంట్​లో కాలిపోయిన పరికరాలను చూశారు. ఆరో యూనిట్లో ప్రారంభమైన మంటలు మిగతా యూనిట్లకు అంటుకొని నాలుగో యూనిట్ ఎలా కాలిపోయిందో తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కొందరు ఇంజనీర్ల వద్ద సంతాప సభ నుంచి బయటకు వచ్చిన వివరాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ‘‘ఇంటి గుట్టు రట్టు చేసేలా బయటకు లీకులు ఇస్తారా? కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తారా? మీరు ఇవ్వనిది మీడియాకు ఫొటోలు, వీడియోలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ? ఇలాంటి పనులు కరెక్ట్​ కాదు’’ అని ప్రభాకర్​రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటం

పవర్​ ప్లాంట్​ ఎంప్లాయీస్, ఇంజనీర్ల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, మరోసారి ప్రమాదం జరగకుండా చూస్తామని ప్లాంట్​ ఎంప్లాయీస్ కు ట్రాన్స్​కో , జెన్ కో సీఎండీ ప్రభాకర్​రావు హామీ ఇచ్చారు. ప్లాంట్​ ఆవరణలో ఆయన ఎంప్లాయీస్ తో మాట్లాడారు. భయపడొద్దని, మరింత డెడికేషన్ తో పనిచేసి రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అగ్నిప్రమాదంలో కొందరు ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఇలాంటప్పుడు భయం సహజమని, తొందరగా బయటపడి డ్యూటీలో చేరాలన్నారు.