
ఒక ఉద్యోగిగా ప్రయాణం ప్రారంభించి కోటి రూపాయల మైలు రాయిని చేరుకోవటం అంత ఈజీ కాదు. దానికి ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక క్రమశిక్షణ అలాగే ఆర్థిక అక్షరాస్యత. ఉన్న డబ్బును ఎలా ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది అన్నదానిలోనే అసలైన కిటుకు దాగి ఉంటుంది. దీనికోసం సంపాదించటంతో పాటు దానిని పెట్టుబడులకు మళ్లించటం కూడా ముఖ్యమే.
కార్పొరేట్ ఉద్యోగి తాను కేవలం 9 సంవత్సరాల్లోనే కోటి రూపాయల నికర సంపద సాధించినట్లు రెడ్డిట్ లో పంచుకున్న వివరాలు చాలా మందికి స్పూర్తిని నింపుతున్నాయి. స్థిరాస్తి, ESOPలు లేదా కుటుంబ ఆర్థిక సహాయం లేకుండానే ఈ విజయాన్ని సాధింటినట్లు సదరు వ్యక్తి వెల్లడించారు. మెుదట్లో తన నెలజీతం రూ.53వేలు మాత్రమే ఉన్న ఉద్యోగి, పదోన్నతులు, ఉద్యోగ మార్పులు, శాలరీ హైక్స్ తో తన ఆదాయాన్ని నెలకు రూ.2.5 లక్షలకు పెంచుకున్నాడు. ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైనది అతని ఆర్థిక అలవాట్లు.
ముందుగా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం పెట్టుబడులకు మళ్లించాడు సదరు ఉద్యోగి. అలాగే బోనస్‌లు, అదనపు ఆదాయాన్ని ఖర్చు చేయకుండా పొదుపుకు కేటాయించడం విజయానికి మూలంగా నిలిచింది. ప్రస్తుతం అతని పెట్టుబడి పోర్ట్‌ఫోలియో విలువ రూ.1.09 కోట్లుగా ఉంది. ఇందులో రూ.70 లక్షలు ఈక్విటీ (మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, EPF, PPF)లో పెట్టగా.. మిగిలిన రూ.39 లక్షలు డెట్ లో ఉంచారు. అత్యవసరాల కోసం రూ.15 లక్షల లిక్విడ్ ఫండ్ కూడా నిర్మించుకున్నాడు ఉద్యోగి.
సరైన సమయం కోసం ఎదురుచూడకుండా తొందరగా పెట్టుబడి ప్రారంభించడం మంచిదని కొవిడ్ సమయంలో అర్థం చేసుకున్న ఆ వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో ఖాళీగా మూలుగుతున్న రూ.25 లక్షలను పెట్టుబడులుగా మార్చాడు. ఇదే సమయంలో తన ఖర్చులు అదుపు తప్పకుండా కూడా వాటిఫై దృష్టి పెట్టాడు. వీటిని ట్రాక్ చేసుకునేందుకు ఎక్స్ఎల్ షీటులో రికార్డు చేసుకునేవాడు. భవిష్యత్తులో కోటిరూపాయలతో పూర్తి ఈక్విటీ పోర్ట్ ఫోలియోను నిర్మించాలనే లక్ష్యంతో అతను ముందుకు సాగుతున్నాడు.