హెలికాఫ్టర్ ఎలా ప్రమాదానికి గురైందంటే..

హెలికాఫ్టర్ ఎలా ప్రమాదానికి గురైందంటే..

బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి సీడీఎస్‌‌ బిపిన్ రావత్, ఆయన భార్య సహా తొమ్మిది మంది ప్రత్యేక విమానంలో తమిళనాడులోని సూలూరుకు బయలుదేరారు.
11:35 నిమిషాలకు సూలూరు ఎయిర్‌‌‌‌ఫోర్స్ స్టేషన్‌‌కు చేరుకున్నారు.
హెలికాప్టర్ స్టాఫ్‌‌ ఐదుగురు, రావత్‌‌ సహా 14 మందితో 11:45 గంటలకు ఐఏఎఫ్ ఎంఐ 7వీ5 హెలికాప్టర్‌‌‌‌లో వెల్లింగ్టన్ బయల్దేరారు. 
కత్తేరి ఏరియా నంచాప చత్తారం వద్ద మధ్యాహ్నం 12:20 నిమిషాలకు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. 
సూలూరు ఎయిర్‌‌‌‌ఫోర్స్ స్టేషన్‌‌ నుంచి 94 కిలోమీటర్లు ప్రయాణించాక ప్రమాదం జరిగింది.
మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే వెల్లింగ్టన్ ఆర్మీ క్యాంపుకు హెలికాప్టర్‌‌‌‌ చేరుకునేది.

  • తమిళనాడులోని కూనూరు వద్ద ఘోర ప్రమాదం
  • ఆయన భార్యతో పాటు మొత్తం 13 మంది మృతి'
  • మంటల్లో కాలిపోయిన అధికారులు
  • ప్రమాదం నుంచి బయటపడ్డ కెప్టెన్ వరుణ్‌‌
  • పొగమంచు వల్లే ప్రమాదం!
  • విచారణకు ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఆదేశం
  • గొప్ప దేశభక్తుడిని కోల్పోయాం: ప్రధాని మోడీ

కూనూర్/న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ కుప్పకూలడంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. రావత్ భార్య మధూలికతోపాటు మరో 11 మంది చనిపోయారు. హెలికాప్టర్‌‌‌‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్‌‌ సింగ్‌‌ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. జనరల్ రావత్.. బుధవారం ఢిల్లీ నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్‌‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, దీనికి కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు ఎయిర్‌‌‌‌ఫోర్స్ చెప్పింది. రావత్‌‌ దంపతులు, ఇతర అధికారులు చనిపోవడంపై రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై గురువారం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.
కోయంబత్తూర్‌ కూనూరు మధ్యలో ఉన్న అడవిలో మధ్యాహ్నం 12.20 సమయంలో భారీ శబ్దంతో చాపర్ క్రాష్ అయింది. హెలికాప్టర్‌‌ నేలను తాకే సమయానికి మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతం కావడంతో వేగంగా వ్యాపించాయి.
చెట్ల మధ్య.. రోడ్డుకు దూరంగా..
కూనూర్‌‌‌‌ దగ్గర రోడ్డుకు 10  కిలోమీటర్ల దూరంలో చెట్ల మధ్య హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. ఎమర్జెన్సీ వర్కర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే హెలికాప్టర్‌‌ మంటల్లో కాలిపోతోంది. శిథిలాలతో, కాలిన మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా ఉంది. మంటల్లో చిక్కుకున్న కొందరు వ్యక్తులు హెలికాప్టర్‌‌పై నుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొద్దిసేపటి దాకా మంటల్లో చిక్కుకుని కొందరు విలవిల్లాడారు. చాలా శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. తీవ్రమైన పొగ, మంటల మధ్యే క్షతగాత్రులను, డెడ్ బాడీలను స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఘటన గురించి తెలియగానే ప్రమాద స్థలికి ఉన్నతాధికారులను తమిళనాడు ప్రభుత్వం పంపింది. ఊటీ నుంచి మెడికల్ టీమ్, కోయంబత్తూరు నుంచి ఎక్స్‌‌పర్టులు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు సాయంత్రం దాకా కొనసాగాయి.
ఇయ్యాల పార్లమెంటులో ప్రకటన
హెలికాప్టర్ ప్రమాదంపై గురువారం పార్లమెంటులో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్ కలిశారని, ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి ఘటన గురించి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి ఢిల్లీ నుంచే పరిస్థితిని సమీక్షించారు. అంతకుముందు ప్రమాదం జరిగిన వెంటనే డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె.. జనరల్ రావత్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో 
మాట్లాడారు.
చదువుకున్న చోట లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తూ..
గతంలో తాను చదువుకున్న చోటే.. అత్యున్నత సైనిక అధికారి హోదాలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తూ కన్నుమూశారు సీడీఎస్ బిపిన్ రావత్. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత నేషనల్‌‌ డిఫెన్స్‌‌ అకాడమీలో చేరిన ఆయన.. తమిళనాడు నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్‌‌ కంటోన్మెంట్‌‌లో ఉన్న డిఫెన్స్‌‌ సర్వీసెస్‌‌ స్టాఫ్‌‌ కాలేజీలో (డీఎస్‌‌ఎస్‌‌సీ)లో గ్రాడ్యుయేషన్‌‌ పూర్తిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని కాన్సాస్‌‌లో యునైటెడ్‌‌ స్టేట్స్‌‌ ఆర్మీ కమాండ్‌‌ అండ్‌‌ జనరల్‌‌ స్టాఫ్‌‌ కాలేజీలో హయ్యర్‌‌ కమాండ్‌‌ కోర్స్‌‌ పూర్తి చేశారు. దేవీ అహల్యా యూనివర్సిటీలో ఎంఫిల్‌‌  పూర్తిచేశారు. తమిళనాడు నీలగిరి హిల్స్‌‌లోని వెల్లింగ్టన్‌‌కు బుధవారం ఉదయం జనరల్ బిపిన్ రావత్ తన భార్యతో కలిసి ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌‌లోని ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఆఫీసర్లను ఉద్దేశించి ఆయన లెక్చర్ ఇవ్వాల్సి ఉంది. ముందుగా కోయంబత్తూరులోని సూలూరుకు చేరుకున్న ఆయన.. అక్కడి ఎయిర్‌‌‌‌ఫోర్స్ బేస్ నుంచి ఎంఐ17వీ5 హెలికాప్టర్‌‌‌‌లో ఆర్మీ సిబ్బందితో కలిసి బయల్దేరారు. అయితే కూనూరు దగ్గరికి రాగానే ప్రమాదం జరిగింది.
బుధవారం వెల్లింగ్టన్‌‌లోని డిఫెన్స్‌‌ సర్వీస్‌‌ కాలేజీలో లెక్చర్‌‌ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ప్రాణాలు కోల్పోవడాన్ని కాలేజీ సిబ్బంది, ఫ్యాకల్టీ నమ్మలేకపోయారు.
తప్పిన పెను ప్రమాదం
నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా హెలికాప్టర్ కూలింది. జనాల మధ్య ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేది. కింద పడిపోతున్న సమయంలో ఒక ఇంటిని కూడా చాపర్ తాకింది. అయితే అప్పటికి ఇంట్లో  ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
బకెట్లతో నీళ్లు చల్లి..
భారీ శబ్దం రావడంతో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. హెలికాప్టర్‌‌‌‌లో ఉన్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బకెట్లు, పైపుల ద్వారా నీళ్లు కొట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అంతెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలను చల్లార్చడం సాధ్యం కాకపోవడంతో.. తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే అధికారులకు సమాచారం అందించారు.
కొన్నిగంటలు ఉత్కంఠ
ప్రమాదంలో 13 మంది చనిపోయారని, ఒకరు తీవ్ర గాయాలతో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని ఎయిర్‌‌‌‌ఫోర్స్ ప్రకటించింది. అటు బిపిన్ రావత్ పరిస్థితి ఏంటన్నది బయటపెట్టలేదు. గాయపడ్డ వ్యక్తి ఎవరన్నదీ కొన్ని గంటలపాటు చెప్పలేదు. దీంతో రావత్ బతికే ఉన్నారని అందరూ అనుకున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. కానీ చివరికి ఆయన చనిపోయినట్లు ఎయిర్‌‌‌‌ఫోర్స్ ప్రకటించింది.

చెట్టును ఢీకొట్టి మంటలు చెలరేగాయి: ప్రత్యక్ష సాక్షి
చెట్లను ఢీకొట్టిన హెలికాప్టర్‌‌‌‌లో మంటలు చెలరేగడం చూశానని ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి చెప్పారు. ‘‘పెద్ద సౌండ్ వచ్చింది. ఏం జరిగిందో చూడడానికి బయటికి వచ్చాను. అప్పటికే హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. పూర్తిగా మంటల్లో కాలిపోతున్న ఇద్దరు, ముగ్గురు హెలికాప్టర్‌‌‌‌లో నుంచి బయటికి రావడం చూశాను. చుట్టుపక్కల ఉండే వాళ్లను పిలిచి సహాయం చేయడానికి ప్రయత్నించా. ఫైర్‌‌‌‌, ఎమర్జెన్సీ సిబ్బందికి ఇన్ఫామ్ చేశా” అని పేర్కొన్నారు. 

2015లో జరిగిన ప్రమాదంలో..
ఆరేండ్ల క్రితం నాగాలాండ్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో జనరల్​ బిపిన్​ రావత్​ క్షేమంగా బయటపడ్డారు. లెఫ్టినెంట్​ జనరల్​గా విధులు నిర్వహిస్తున్న రావత్​ నాగాలాండ్​లోని దిమాపూర్​లో 2015 ఫిబ్రవరి 3న పర్యటించారు. అక్కడి నుంచి చీటా హెలికాప్టర్​ లో తిరిగి బయల్దేరారు. అయితే, హెలికాప్టర్​ గాల్లోకి లేచిన కాసేపటికే ఇంజన్​ ఫెయిల్​ కావడంతో క్రాష్​ ల్యాండ్​ అయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో రావత్​తో పాటు ఇద్దరు పైలెట్లు, మరో కర్నల్​ ఉన్నారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
భర్తకు తోడుగా.. సైనిక కుటుంబాలకు అండగా..
సైనిక దళాలకు బిపిన్​ రావత్​ హెడ్​ అయితే.. ఆ సైనికుల కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా గుర్తుకు వచ్చే పేరు మధూలిక రావత్​. దేశ రక్షణలో భర్త బిజీగా ఉంటే.. సామాజిక కార్యక్రమాల్లో ఆమె తీరిక లేకుండా ఉండేవారు. అమరవీరుల కుటుంబాలతోపాటు దివ్యాంగ పిల్లలకు, కెన్సర్​ బాధితులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. ఆర్మీ వైవ్స్​వెల్ఫేర్​ అసోసియేషన్(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) ప్రెసిడెంట్​అయిన మధూలిక రావత్​..  అమరవీరుల భార్యలకు టైలరింగ్‌‌, బ్యూటీషియన్‌‌ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో ట్రైనింగ్ ఇప్పిస్తూ సొంత కాళ్ల మీద నిలబడేలా చేసేవారు. వీర్​ నారీస్​ అనే ఎన్జీవోలో కూడా ఆమె పనిచేశారు. మధ్యప్రదేశ్​కు చెందిన పొలిటీషియన్​ మృగేందర్​ సింగ్​ కూతురైన మధూలిక.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేట్​పట్టా అందుకున్నారు. మరణంలో కూడా ఆమె భర్త వెంటే నడిచారు. ఈ దంపతులకు కృతిక, తరణి అనే ఇద్దరు కూతుళ్లు. 
చనిపోయింది వీరే..
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, మధూలిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కర్నల్ హర్జీందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్వాడ్రన్ లీడర్ కె. సింగ్, జేడబ్ల్యూవో దాస్, జేడబ్ల్యూవో ప్రదీప్.ఏ, హవల్దార్ సత్పాల్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేందర్, లాన్స్ నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బి. సాయితేజ. 
మృతుల్లో చిత్తూరువాసి
హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీకి చెందిన సాయితేజ కూడా చనిపోయారు. ఈయన స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ. సాయితేజ లాన్స్ నాయక్‌‌గా డ్యూటీ చేస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌‌ రావత్‌‌‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్నారు. 2013లో ఆర్మీలో చేరారు. సాయితేజకు భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. 
ఒకే ఒక్కడు
హెలికాప్టర్ ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రమైన గాయాలతో వెల్లింగ్టన్‌‌లోని మిలటరీ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారు. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తినా.. తేజస్ యుద్ధ విమానాన్ని క్రాష్ కాకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుణ్ సింగ్​ ధైర్యానికి ఆగస్టులో ‘శౌర్య చక్ర’ అవార్డు దక్కింది.
కేబినెట్ కమిటీ 2 నిమిషాల మౌనం
హెలికాప్టర్‌‌ ప్రమాదంలో చనిపోయిన ‌‌సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది ఆర్మీ ఆఫీసర్లకు ‘కేబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ’ నివాళులర్పించింది. బుధవారం ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ.. 2 నిమిషాలపాటు మౌనం పాటించింది. సరిహద్దుల్లో చైనాతో గొడవల నేపథ్యంలో తర్వాతి సీడీఎస్ ఎవరు అనే దానిపై కమిటీ చర్చిస్తుందా అనే ఊహాగానాల నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగింది. డిఫెన్స్, హోం, ఫైనాన్స్ శాఖల మంత్రులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ తదితరులు 
హాజరయ్యారు.
గవర్నర్‌,  సీఎం కేసీఆర్‌‌‌‌ నివాళి
హైదరాబాద్​, వెలుగు: బిపిన్ రావత్‌‌ మృతి ఎంతగానో కలచివేసిందని గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, ఆయన భార్య మధూలికా రావత్‌‌ సహా పలువురు జవాన్లకు వారు సంతాపం తెలిపారు. దేశానికి రావత్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రమాదంలో మరణించిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.