సర్కారీ బడులకు కమర్షియల్ విద్యుత్ బిల్లింగ్ ఎలా వేస్తరు : కిషన్ రెడ్డి

సర్కారీ బడులకు కమర్షియల్ విద్యుత్ బిల్లింగ్ ఎలా వేస్తరు :  కిషన్ రెడ్డి
  • బిల్లులు కట్టకుంటే ప్రభుత్వాన్ని అడగండి
  • విద్యుత్ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం బేగంపేటలోని తెలంగాణ హరిత ప్లాజా హోటల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దిశా కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సర్కారీ స్కూళ్లు కరెంట్ బిల్లులు చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలన్నారు.  బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రభుత్వాన్నే అడగాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వొద్దని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆయన హెచ్చరించారు. స్కూళ్లకు ఫ్రీగా కరెంట్ ఇవ్వమని మిమ్మల్ని అడగట్లేదని, ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకోవాలని సూచించారు. బై మిస్టేక్​లో ఇలా జరుగుతోందని విద్యుత్ అధికారులు కిషన్ రెడ్డికి వివరించగా.. ప్రతి నెలా ఇలానే జరుగుతోందా అంటూ ఆయన తిరిగి వారిని ప్రశ్నించారు. అనంతరం హైదరాబాద్ సిటీలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అమలవుతున్న వివిధ పథకాలపై రివ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు.  అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కమర్షియల్ కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని, దీంతో బిల్లులు ఎక్కువ వస్తున్నాయని మంత్రికి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? అని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ‘సిటీలో స్కూళ్లు, హాస్టళ్లు రెంటల్​ బిల్డింగ్స్​లో నడుస్తున్నాయి. రూ. వేల కోట్లు తెచ్చి రైతులకు ఇస్తున్నారు. పిల్లలకు కూడా ఖర్చుపెట్టండి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.

కేంద్ర పథకాల అమలుపై రివ్యూ

దిశా కమిటీ చైర్మన్​గా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు, వివిధ ప్రజా సమస్యలపై కిషన్ రెడ్డి చర్చించారు. బ్యాంక్, విద్య, ఆరోగ్య , రైల్వే, వాటర్ వర్క్స్, సివిల్ సప్లయ్, నేషనల్ హైవే, మహిళా శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, పవర్ సప్లయ్, వివిధ డిపార్ట్​మెంట్ల వైజ్​గా రివ్యూ నిర్వహించారు. బ్యాంక్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంత మేరకు లోన్లు మంజూరు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిటీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎడ్యూకేషనల్, ముద్ర, తరుణ్, శిశు, విశ్వకర్మ లోన్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడ్యూకేషన్ లోన్లు ఇవ్వడంలో ఎందుకు వెనబడ్డారని అధికారులను ఆయన ప్రశ్నించారు. కేఎంఐటీ, ముఫకంజా లాంటి కాలేజీల్లో క్యాంప్​లు నిర్వహించాలని, ఎడ్యుకేషనల్ లోన్లు తీసుకునే స్టూడెంట్ల శాతాన్ని పెంచాలని కిషన్ రెడ్డి సూచించారు.

చర్లపల్లి టెర్మినల్​కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి

రాష్ట్రానికి 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని, మొత్తం సిటీకే ఖర్చు చేయమని అడగట్లేదని, హైదరాబాద్ అభివృద్దికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ.715 కోట్లతో ఎయిర్ పోర్టు స్థాయిలో డెవలప్ చేస్తున్నామని.. భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదన్నారు. సికింద్రాబాద్ తో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్​ను రూ.500 కోట్లతో, నాంపల్లి స్టేషన్​ను రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని.. అదనంగా చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్​కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే పూర్తవుతుందన్నారు. సిటీ నుంచి యాదగిరి గుట్టకు రైల్వే ప్రాజెక్ట్ భూ సేకరణ సమస్యలతో పెండింగ్​లో ఉందని ఆయన తెలిపారు.  కొమురవెల్లిలో రైల్వే స్టేషన్​ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, తొందరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.

పెండింగ్ పనులు పూర్తి చేయాలి

అంబర్​పేట చే నంబర్ టు ఉప్పల్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్​ను తొందరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఏండ్లుగా ఈ నిర్మాణ పనుల సాగుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారని.. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తోందన్నారు. మైనార్టీలకు 29 స్కూల్​ భవనాలు కేంద్ర ప్రభుత్వం అప్రూవ్​ చేస్తే.. ఇప్పటివరకు ఒక్క బిల్డింగే పూర్తయిందన్నారు. చిలకలగూడ జంక్షన్​లో రోడ్డు దాటడానికి వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని.. అక్కడ ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు.  ఓయూ నుంచి విద్యానగర్ వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి ఇరుకుగా ఉందని.. దానిని వెడల్పుగా నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.  సమావేశంలో దిశా కమిటీ కో చైర్ పర్సన్ కె. కేశవరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు.