
పనస.. పండు అయితే నేరుగా తింటారు. మరి పచ్చిదైతే.. వండుకుని తినొచ్చు. పనసకాయ ఎలా తిన్నా దాని రుచే అమోఘం. ప్రస్తుతం మార్కెట్లో పచ్చివి, పండువి రెండూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పనసకాయతో అందరూ ఇష్టపడే బిర్యానీ.. బగారా రైస్ లేదా రోటీలోకి మసాలా గ్రేవీ కర్రీ.. సాయంత్రంపూట శ్నాక్లాగ జాక్ ఫ్రూట్ 65 చేసుకుని తినొచ్చు. అవే ఈ వారం స్పెషల్స్. మరింకెందు కాలస్యం.. పనస విందుకు రెడీ అయిపోండి.
పనసకాయ బిర్యానీ
బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. పనసకాయ ముక్కల్ని ఉప్పు నీళ్లలో వేసి కడగాలి. ఒక పాత్రలో నీళ్లు కాగబెట్టి అవి తెర్లిన తర్వాత పనసకాయ ముక్కల్ని వేయాలి. అందులో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత ముక్కల్ని సపరేట్ చేయాలి. పాన్‌లో నూనె వేసి పనసకాయ ముక్కల్ని వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేగించిన ఉల్లిగడ్డ తరుగు, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. కాసేపటి తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి నీళ్లు పోసి మరోసారి కలపాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. మరో పాన్‌లో నీళ్లు పోసి ఉప్పు, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు వేసి మూతపెట్టి కాగనివ్వాలి. నీళ్లు తెర్లాక అందులో నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి మూతపెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో బియ్యాన్నీ, పనసకాయ గ్రేవీని బిర్యానీలాగ లేయర్లుగా వేయాలి. పైన జీడిపప్పులు కూడా చల్లి మూతపెట్టి మరికాసేపు ఉడికిస్తే వేడి వేడిగా పనసకాయ బిర్యానీ లాగించేయొచ్చు.
తయారీ
కావాల్సినవి : పచ్చి పనసకాయ (చిన్నది) – ఒకటి, బాస్మతీ బియ్యం – అరకిలో, యాలకులు – మూడు, దాల్చిన చెక్క, అనాస పువ్వు – ఒక్కోటి, బిర్యానీ ఆకులు – రెండు, లవంగాలు – నాలుగు, షాజీరా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా – ఒక్కోటీస్పూన్, ఉల్లిగడ్డ తరుగు (వేగించి) – అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీస్పూన్, జీడిపప్పులు – కొన్ని, పెరుగు – ఒక కప్పు, పుదీనా, కొత్తిమీర – కొంచెం, పచ్చిమిర్చి – నాలుగు, నూనె – సరిపడా, పసుపు, ఉప్పు, కారం, నీళ్లు – సరిపడా, నిమ్మరసం – అర టీస్పూన్
మసాలా
కావాల్సినవి : పనసకాయ ముక్కలు – ఒక కప్పు, టొమాటోలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, అల్లం – చిన్న ముక్క, జీడిపప్పులు – ఎనిమిది, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి ,లవంగాలు, మిరియాలు, పసుపు, గరం మసాలా – పావు టీస్పూన్ చొప్పున, ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – సరిపడా
తయారీ :
ఒక పాత్రలో నీళ్లు పోసి ఉప్పు వేసి, పనసకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు ఉడికించాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో పనసకాయ ముక్కల్ని వేసి వేగించి పక్కన పెట్టాలి. మిక్సీజార్‌లో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, ఉల్లిగడ్డ తరుగు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా వేగించాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న టొమాటో మిశ్రమం వేసి కలపాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత పనసకాయ ముక్కల్ని కూడా వేసి కలపాలి. నీళ్లు పోసి మూతపెట్టి మరికాసేపు మగ్గనిస్తే సరి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే పనసకాయ కూర రెడీ.
జాక్‌ఫ్రూట్ 65
కావాల్సినవి :
పనసకాయ ముక్కలు – రెండు కప్పులు, ఉప్పు, నూనె – సరిపడా, ఎండు మిర్చి – ఒక కప్పు, వెనిగర్ – మూడు టీస్పూన్లు, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – ఒక్కో టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు, మైదా, బియ్యప్పిండి, కారం – ఒక్కో టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, కరివేపాకు – కొంచెం
తయారీ :
పాన్‌లో టీ గ్లాసు నీళ్లు పోసి అవి మరిగాక, అందులో ఎండు మిర్చి వేసి ఉడికించాలి. నీళ్లు ఆవిరయ్యేంతవరకు ఉడికాక వాటిని మిక్సీ జార్లో వేయాలి. దాంతోపాటు ఉప్పు, వెనిగర్ వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో పనసకాయ ముక్కలు, ఉప్పు వేసి నిమ్మరసం చల్లాలి. వాటితోపాటు రెడీ చేసి పెట్టుకున్న మిర్చీ పేస్ట్, కార్న్ ఫ్లోర్, కారం, మైదా, కారం, బియ్యప్పిండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి, కొద్దిగా నీళ్లు చల్లి అవన్నీ బాగా కలిసేలా కలపాలి. తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరో పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మసాలా పట్టించి ఉంచిన పనసకాయ ముక్కల్ని వేసి పకోడీల్లా వేసి వేగించాలి. అవి బాగా వేగాక నూనె లేకుండా ప్లేట్లోకి తీసుకుని కారం చల్లుకుని తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.