ఇడ్లీ కోసం పాత్ర​ అక్కర్లేదు తెలుసా!

ఇడ్లీ కోసం పాత్ర​ అక్కర్లేదు తెలుసా!

ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్ర, కేక్​, పిజ్జాలకు ఒవెన్​ అక్కర్లేదు తెలుసా! నమ్మకం కుదరట్లేదా..? అయితే పాన్ ఇడ్లీ, పాన్ పిజ్జా, పాన్ కప్​ కేక్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇడ్లీ, పిజ్జా.. పెనం మీద, కప్ కేక్​ పొంగనాల పాన్​ మీద చేస్తే సరి. అదెలా? అంటే... ఇలా అన్నమాట.

స్పాట్ ఇడ్లీ

కావాల్సినవి :
ఇడ్లీ రవ్వ – ఒకటిన్నర కప్పు, మినపప్పు – అర కప్పు, మెంతులు – ఒక టీస్పూన్
అటుకులు – మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నీళ్లు – సరిపడా, కొత్తిమీర – కొంచెం, టొమాటోలు – రెండు
పచ్చిమిర్చి – ఒకటి
నూనె, వెన్న – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, కారం పొడి కోసం :
శనగపప్పు, కారం – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, మినపప్పు, ధనియాలు – ఒక్కోటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ చొప్పున
మెంతులు, ఆవాలు– ఒక టీస్పూన్ 
జీలకర్ర – అర టేబుల్ స్పూన్ 
కరివేపాకు, చింతపండు – కొంచెం
ఉప్పు – సరిపడా
కారం పొడి : ఒక పాన్​లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చింతపండు, కరివేపాకు వేసి వేగించాలి. అందులో కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి. 
 

ఇడ్లీ పిండి: ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వ వేసి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరో గిన్నెలో మినపప్పు, మెంతులు వేసి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్​లో నానబెట్టిన మినపప్పు మిశ్రమం, అటుకులు, కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఇడ్లీ రవ్వను నీళ్లు పిండి ఒక గిన్నెలో వేయాలి. అందులో మిక్సీ పట్టిన మినపప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి. గిన్నెపై మూత పెట్టి మరో పది గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి కలిపితే ఇడ్లీ పిండి రెడీ.

తయారీ: ఒక పాన్​లో ఉల్లిగడ్డ, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, వెన్న వేసి వేగించాలి. ఆ మిశ్రమాన్ని మూడు భాగాలు చేసి, ఇడ్లీ పిండి పోయాలి. దానిపై కారంపొడి చల్లాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాక రెండో వైపు తిరగేస్తే స్పాట్ ఇడ్లీ రెడీ.   

మినీ కేక్స్ 

కావాల్సినవి :

మైదా – ఒకటిన్నర కప్పు
కస్టర్డ్ పౌడర్ – అర కప్పు చక్కెర పొడి
పాలు – ఒక్కో కప్పు చొప్పున
నూనె – ముప్పావు కప్పు
బేకింగ్ సోడా – అర టీస్పూన్
బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్
టూటీ ఫ్రూటీ – సరిపడా

తయారీ :మొదట మైదా, కస్టర్డ్ పౌడర్ జల్లెడ పట్టాలి. ఒక గిన్నెలో మైదా, కస్టర్డ్ పౌడర్, చక్కెర పొడి, నూనె వేసి కలపాలి. తర్వాత బేకింగ్​ సోడా, బేకింగ్ పౌడర్, టూటీ ఫ్రూటీ వేసి, పాలు పోసి బాగా కలపాలి. పొంగనాల పాన్​లో నూనె రాసి, కేక్ మిశ్రమాన్ని పోయాలి. వాటి పైన మరోసారి టూటీ ఫ్రూటీ చల్లి, మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. 

పాన్ పిజ్జా 

కావాల్సినవి :
మైదా, పెరుగు – ఒక కప్పు చొప్పున, ఈస్ట్ పౌడర్, చక్కెర, కార్న్​ ఫ్లోర్ – రెండు టీస్పూన్ల చొప్పున, ఉప్పు, నీళ్లు – సరిపడా
చీజ్ – అర కప్పు
చికెన్ – పావు కప్పు
ఉల్లిగడ్డ తరుగు – ఒక టేబుల్ స్పూన్, కసూరీ మేతీ, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, వెల్లుల్లి తరుగు, చాట్ మసాలా – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
పిజ్జా సాస్ : మైదా, కారం, చక్కెర – ఒక్కో టీస్పూన్ చొప్పున
టొమాటో తరుగు – ఒక కప్పు, టొమాటో ప్యూరీ – పావు కప్పు
వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
ఒరెగానో – అర టీస్పూన్
ఉప్పు, నూనె – సరిపడా
 

తయారీ : ఒక గిన్నెలో ఉప్పు, ఈస్ట్​ పౌడర్, నీళ్లు పోసి కలపాలి. ఆ నీటిని మైదాలో పోసి ముద్దగా కలపాలి. ఒక గిన్నెలో చికెన్, పెరుగు, కారం, కసూరీ మేతీ, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, నూనె వేసి కలపాలి. ఒక పాన్​లో ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. అందులో టొమాటో ప్యూరీ, ఉడికించి టొమాటో గుజ్జు, కారం, ఉప్పు, చక్కెర, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. 

ఒక పాన్​లో మరో పాన్​ పెట్టి, అందులో రవ్వ చల్లి, పిజ్జా బేస్ పెట్టాలి. దానిపైన టొమాటో మిశ్రమం పూయాలి. పైన చీజ్​, చికెన్​, టొమాటో, ఉల్లిగడ్డ ముక్కలు పెట్టి మూత పెట్టాలి. ఆ తర్వాత మూత తీయాలి. దాని బదులు కింద ఉన్న పాన్​ తీసి పైన మూతలా పెట్టాలి. ఆ పాన్​లో మండుతున్న బొగ్గులు వేయాలి. పది నిమిషాల తర్వాత చూస్తే పర్ఫెక్ట్​ పిజ్జా రెడీ.  కావాలంటే చికెన్​ కాస్త ఫ్రై చేసి, వేయొచ్చు.