
రోజూ పదివేల అడుగులు నడవడం ఆరోగ్యానికి చాలామంచిదని డాక్టర్లు చెప్తుంటారు. కానీ.. వర్క్ బిజీ వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని సిటీల్లో పనిచేసే ఉద్యోగులు అంటుంటారు. ఇలాంటివాళ్లలో చాలామంది సెడెంటరీ లైఫ్ స్టయిల్‌కి అలవాటుపడుతున్నారు. ముఖ్యంగా డెస్క్‌ల్లో పనిచేసేవాళ్లలో కొందరు రోజుకు 2వేల అడుగులు కూడా వేయడం లేదు. కానీ.. ఖాళీ టైం దొరికిన ప్రతిసారి నడిస్తే లక్ష్యం చేరుకోవడం సులభమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ టిప్స్ పాటిస్తే.. 9 –5 ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా రోజులో ఈజీగా పదివేల కంటే ఎక్కువ అడుగులే నడవచ్చు.
ఎక్కువసేపు సీట్లోనే కూర్చోవడం వల్ల యాక్టివిటీ లెవల్స్ బాగా తగ్గుతాయి. కాబట్టి నిలబడడానికి, నడవడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నీళ్ల బాటిల్ అందుబాటులో పెట్టుకోకుండా దాహమేసిన ప్రతిసారి నీళ్ల దగ్గరికే వెళ్లి తాగాలి. ఆఫీస్‌లో ఎవరిని కలవాలన్నా మీరే వాళ్ల దగ్గరకు వెళ్లాలి.
ప్రతి ఒక్కరూ రోజులో కచ్చితంగా అరగంటైనా ఫోన్ మాట్లాడుతుంటారు. అలాంటివాళ్లు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వర్క్‌స్పేస్ లేదా కారిడార్‌లో నడవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల పని మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడదు.
లిఫ్ట్‌కి బదులుగా మెట్లు ఎక్కడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అడుగుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే ఆఫీస్, ఫ్లాట్.. ఇలా ఎక్కడైనా లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించాలి.
ఆఫీస్‌ల్లో కలిసి లంచ్ చేశాక క్యాంటీన్‌లో కబుర్లు చెప్పుకోకుండా సరదాగా నడుస్తూ మాట్లాడుకోవచ్చు. అందుకోసం 10–15 నిమిషాలు కేటాయించినా సరిపోతుంది. దీనివల్ల అడుగుల సంఖ్య పెరగడమే కాకుండా మానసిక స్థితి మెరుగుపడుతుంది.
పైన చెప్పినవన్నీ చేసినా లక్ష్యాన్ని చేరుకోలేకపోతే, మిగిలిన అడుగులను పూర్తి చేయడానికి సాయంత్రం నడవాలి. రాత్రి తిన్న తర్వాత లేదంటే పడుకునే ముందు నడిస్తే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.