- కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్‌కు హెచ్ఆర్డీఏ కంప్లైంట్
- నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ, మేనేజ్‌మెంట్ కోటా (ఎంక్యూ1) రౌండ్-2 విద్యార్థుల నుంచి రూల్స్ కు విరుద్ధంగా పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ( హెచ్‌ఆర్‌డీఏ) ఆరోపించింది. ఈ మేరకు గురువారం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) రిజిస్ట్రార్ కు కంప్లైంట్ చేసింది.
ఇటీవల ఫీజుల వసూలుపై హైకోర్టు స్పష్టంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, యాజమాన్యాలు వాటిని బేఖాతరు చేస్తున్నాయని అసోసియేషన్ మండిపడింది. అంతేకాకుండా.. అడిగినంత ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తామంటూ స్టూడెంట్లను అకడమిక్ వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతో స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.
ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి..
గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఫీజుల విషయమై హైకోర్టు సుమారు తొమ్మిది వేర్వేరు రిట్ పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హెచ్‌ఆర్‌డీఏ గుర్తు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి వర్సిటీ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని, విద్యార్థులపై ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడకుండా యాజమాన్యాలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా ఆయా కాలేజీల నుంచి తక్షణమే కంప్లయన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌డీఏ విజ్ఞప్తి చేసింది.
మేనేజ్మెంట్ కోటాలో మొత్తం ఫీజులో 60 శాతం మాత్రమే చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, కానీ ఈ కాలేజీలు మొత్తం ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని హెచ్‌ఆర్‌డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ కార్తీక్ నాగుల పేర్కొన్నారు.
