ఒక్కడికే మూడు ఓట్లు..సిటీలో భారీగా బోగస్ ఓట్లు

ఒక్కడికే మూడు ఓట్లు..సిటీలో భారీగా బోగస్ ఓట్లు
  • బోగస్ ఓట్ల ఏరివేతలో ఆఫీసర్లు ఫెయిల్
  • వెబ్ సైట్ లోనూ వివరాలు లేవు

నాంపల్లి నియోజకవర్గంలోని ఓ ఇంట్లో ఆరుగురికి ఓటు హక్కు ఉంటే… లిస్టులో మాత్రం ఎనిమిది ఓట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరో ఇంట్లో ఉన్న ఓటరు కార్డులపై అసలు ఇంటి నంబర్లే లేవు. ఇలా గ్రేటర్​లో చాలా చోట్ల బోగస్​ ఓట్లు ఉన్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్, వెలుగుగ్రేటర్ లో చాలా మంది పేరుతో రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. కార్వాన్ నియోజకవర్గంలోని హషీమ్​నగర్, బాపూనగర్, బాపూనగర్–1 కి సంబంధించిన లిస్ట్​లో 1180 మంది ఓటర్లు ఉంటే ఇందులో దాదాపు 100 కి పైగా ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో 906,907  సీరియల్ నంబర్లో ఒకే మహిళ ఓటును రెండుసార్లు నమోదు చేశారు.  775,782 సీరియల్ నంబర్ రెండింట్లోనూ ఒకే వ్యక్తి పేరు ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా వందల్లో ఓట్లు ఉంటాయని అపొజిషన్ లీడర్లు ఆరోపిస్తున్నారు. 2016లో ఒకసారి సవరణ జాబితా చూస్తే అందులో 82 లక్షల 65 వేల 4 ఓట్లు ఉన్నాయి. అప్పుడు సర్వే చేసి దాదాపు 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా బోగస్ ఓట్ల నమోదు మొదలైంది.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అంతే

గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అపొజిషన్ పార్టీ నేతలు ఈ బోగస్ ఓట్ల వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వీటిని తొలగించే విషయాన్ని పట్టించుకోవటం లేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గత బల్దియా ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ తో ఓడిపోయిన వారంతా బోగస్ ఓట్లే తమను ఓడించాయని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లయింట్ చేసిన పట్టించుకోకపోవటం అనుమానం కలిగిస్తుందని అంటున్నారు. నలుగురు ఉండే ఇంట్లో 10 ఓట్లు ఉంటున్నాయని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుంటలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బల్దియా ఎన్నికల్లో బోగస్ ఓట్లను తొలగించకుండా ఎన్నికలను నిర్వహిస్తామంటే కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.

వెబ్ సైట్​లోనూ ఇన్ఫర్మేషన్​ గాయబ్

టెక్నాలజీ ఇంతగా పెరుగుతున్న ఇప్పటికీ వెబ్ సైట్ లో బల్దియా సమాచారాన్ని పెట్టడం లేదు. జీహెచ్ఎంసీ అఫీషియల్ వెబ్ సైట్​లో ఎన్నికలకు సంబంధించిన వివరాలే  లేవు. దీనిపై సిటిజన్స్ మండిపడుతున్నారు. ఓట్ల నమోదు, వివరాల కోసం రోజు వెబ్ సైట్ చూస్తున్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండటం లేదని చెబుతున్నారు. ఇప్పటికీ 2016 లో డాటానే కనిపిస్తోంది.