
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇటు వెములవాడ, అటు శ్రీశైల పుణ్య క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. వేములవాడ రాజన్న ఆలయం శివనామస్మరణతో మార్మోగుతోంది. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి.. స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు.
సిటీలోని శివాలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. మణికొండలోని రామాలింగేశ్వరస్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూకట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉసిరిచెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అచ్చంపేట కన్యక పరమేశ్వరీ, ఉమా మహేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీశైల పుణ్య క్షేత్రానికి కుటుంబంతో సహా వచ్చిన భక్తులు కార్తీక దీపారాధనలో పాల్గొన్నారు. దర్శనం క్యూ లైన్లలో కిలోమీటరువరకు భక్తులు నిలపడిఉన్నారు. ఉదయం 3 గంటలకు మంగళవాయిద్యాలు, సుప్రభాతం జరుగగా… 4 గంటల నుండే పరమేశ్వరుని దర్శణానికి భక్తులను అనుమతించారు. గుడి ప్రాంగణంలోవున్న గంగమ్మ ఒడిలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు విడిచి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. స్వామివారిని దర్శించడానికి 6 గంటలకు పైగా సమయం పడుతుండటంతో దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్న వారికి పాలు.. మజ్జిగ ప్రసాదాలు అందజేస్తున్నారు గుడి సిబ్బంది.