యాదగిరిగుట్ట నర్సన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట నర్సన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • ఫ్రీ దర్శనానికి నాలుగు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం
  • అరకొర సదుపాయాలతో ఇబ్బంది పడ్డ భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు, అన్నప్రసాద వితరణ కేంద్రం, పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిశాయి.

కొండపైన, కింద పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రదేశాలు పూర్తిగా నిండిపోవడంతో కొంత సేపు కొండపైకి వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, ఘాట్‌‌‌‌‌‌‌‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌ ఏర్పడింది. వాహనాలను యాగశాల ప్రదేశానికి డైవర్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శననారసింహ హోమం, సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అరకొర సదుపాయాలతో భక్తుల ఇబ్బందులు
కొండపైన భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు, ఏర్పాట్లు, సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది.

చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం అరకొరగానే ఉండడంతో భక్తులు ఎండలో అల్లాడిపోయారు. వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందే తెలిసినా.. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు, వసతులు కల్పించడంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.