డేంజర్ జోన్‌‌లో కడెం ప్రాజెక్టు

డేంజర్ జోన్‌‌లో కడెం ప్రాజెక్టు

నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మొత్తం 46 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14.850టి టీఎంసీలకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 9 లక్షల 19 వేల 450 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 9 లక్షల 7 వేల 73 క్యూసెక్కులుగా ఉంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. 

అన్ని గేట్లు ఓపెన్ :-
ఇరిగేషన్ సీఎం OSD శ్రీధర్ దేశ్ పాండే కడెం ప్రాజెక్టు ప్రాజెక్ట్ పరిస్థితిపై ఆరా తీశారు. డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులని, అన్ని గేట్లు ఓపెన్ చేసి నీటిని వదలడం జరుగుతోందన్నారు. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు మించి వస్తుంటే ఏమీ చేయలేమని, ఇతర చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి 1995లో ఎదురైందని గుర్తు చేశారు. చిన్నపాటి ప్రమాదంతో ఆనాడు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. మానవ కృషికి అందని స్థాయిలో ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతామన్నారు. ఇంజినీర్లు, జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నట్లు, ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజినీర్లు గేజింగ్ రూంలో ఉండి వరద స్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. SE సుశీల్  కుమార్, EE రాజశేఖర్, సహచర ఇంజనీర్లు,  సిబ్బంది ధైర్యంగా అక్కడనే ఉన్నారని వెల్లడించారు.