గోనె సంచుల్లో గోల్​మాల్​

గోనె సంచుల్లో గోల్​మాల్​
  • కుమ్మక్కైన కాంట్రాక్టర్లు.. సర్కారుకు రూ. 42.5 కోట్ల టోపీ
  •  పంట చేతికొచ్చాక లేట్​గా ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయం
  •  10 కోట్ల బ్యాగులకు టెండర్లు పిలిచిన సివిల్​ సప్లైస్​ విభాగం
  •   ఒక్కో బ్యాగ్​పై నిరుటి కన్నా రూ. 10కి పైనే టెండర్లు కోట్​ 
  •  కాంట్రాక్టర్లతో సర్కారు రాజీ.. రూ. 30.25 కు రేట్​ ఫిక్స్ 


కాంట్రాక్టర్ల మాయాజాలం
వాస్తవానికి రీ సైక్లింగ్‌‌ చేసిన గన్నీ బ్యాగు ఒక్కోటి రూ. 16, రూ. 17కు దొరకుతాయి. వీటికి ట్రాన్స్‌‌ పోర్టేషన్‌‌ కలిపినా దాదాపు రూ. 24కు మించి ఖర్చయ్యే అవకాశం లేదు. నిరుడు ఇవే బ్యాగులకు కాంట్రాక్టర్లు రూ.26కు ఒక్కోటి చొప్పున టెండర్లు దక్కించుకున్నారు. ఈ ఏడాది కొంత కోషిష్‌‌ చేస్తే రూ. 28కే దొరికే అవకాశం ఉండేది. కానీ ధాన్యం సేకరణపై సర్కారు లేట్​గా నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్టర్లు ఒక్కటై ధర పెంచడంతో ఎక్కువ పెట్టి కొనాల్సి వచ్చింది.  

హైదరాబాద్‌‌, వెలుగు: గోనె సంచుల కొనుగోళ్లలో భారీ గోల్ మాల్ జరిగింది. పంట చేతికొచ్చాక లేట్​గా ధాన్యం కొనుగోళ్లకు సర్కారు అనుమతించడంతో గన్నీ బ్యాగులు తీసుకునేందుకు టైమ్​లేకపోవడం, ఇదే అదనుగా కాంట్రాక్టర్లు కుమ్మక్కై రేట్లు పెంచడంతో సర్కారు రూ. 42.5 కోట్లను అదనంగా ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. నిరుడు ఒక్కో గన్నీ బ్యాగును రూ. 26కే తీసుకోగా ఈసారి రూ. 30.25కు సివిల్​సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ టెండర్​ ఖరారు చేసింది.

గతేడాది వానాకాలంలో 48.85 లక్షల టన్నులు, యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని సర్కారు సేకరించింది. ఈ ఏడాది వానాకాలం 1.34 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అంచనాలు భారీగా పెరగడంతో 10 కోట్ల మేర గోనె సంచులు అవసరమవుతాయని సివిల్‌ సప్లయ్స్‌ శాఖ అక్టోబర్‌ 7న టెండర్‌ విడుదల చేసింది. తక్కువ ధరకు దొరికే రీ సైక్లింగ్ చేసిన గోనె సంచులు (50 కిలోలవి) సేకరించాలనుకుంది. అయితే కొనుగోళ్లపై నిర్ణయం ప్రకటించకుండా సర్కారు లేట్ చేయడం, తీరా పంట చేతికొచ్చాక అనుమతించడంతో గన్నీ బ్యాగులు సమకూర్చుకోవడానికి ఎక్కువ టైమ్ లేకుండా పోయింది. కొనుగోళ్లు స్టార్టవడం, గన్నీ బ్యాగులు భారీగా అవసరం ఉండటంతో ఇదే అదనుగా కాంట్రాక్టర్లు కుమ్మకై రేట్లు పెంచేశారు. 
నిరుడు కన్నా రూ. 4.25 ఎక్కువ
కాంట్రాక్టర్లు ఒక్కో గోనె సంచి రేటును రూ. 32.50 నుంచి రూ.41లకు పైగా టెండర్‌ కోట్‌ చేసినట్లు తెలిసింది. అలా ఎక్కువ ధరకు కోట్‌ చేయడం, గడువు దగ్గర పడటంతో కంగారుపడిన సివిల్‌ సప్లయ్స్‌ విభాగం కాంట్రాక్టర్లతో రాజీకి దిగినట్లు సమాచారం. చివరకు ఒక్కో బ్యాగు రేటు రూ. 30.25 ఫిక్స్​ చేసినట్టు తెలిసింది. ఒక్కో గన్నీ బ్యాగును నిరుడు రూ. 26కే తీసుకున్నారు. ఈ ఏడాదేమో రూ. 30.25కు టెండర్లు ఖరారయ్యాయి. అంటే నిరుడుకన్నా రూ. 4.25 ఎక్కువ ఖర్చు చేశారు. దీంతో 10 కోట్ల గన్నీ బ్యాగులకు రూ. 42.50 కోట్ల అదనపు భారం పడింది.