కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగానే భారీ నష్టం: కాంగ్రెస్

కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగానే భారీ నష్టం: కాంగ్రెస్

వాతావరణ శాఖ ముందు గానే సమాచారం ఇచ్చినా…కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా భారీ నష్టం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగినా…జలమయమైన పంటలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటకపోవడం దారుణమన్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. అంతేకాదు…రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది.. ఎన్ని ఇళ్ళు కూలిపోయాయి..ఎంతమంది చనిపోయారో ఇప్పటి వరకు సైంటిఫిక్ గా సర్వే చేయించలేదని ఆరోపించారు. ఎన్నికల ను దృష్టి లో పెట్టుకొని గ్రేటర్ లో సాయం చేస్తున్నారన్నారు. GHMC కి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా.. కమీషన్ల కోసం మిషన్ కాకతీయ కు తరలిస్తున్నారని ఆరోపించారు. 10వేల రూపాయల సహాయం TRS పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారన్న మధుయాష్కీ…నిజంగా నష్టపోయిన వారికి ఇవ్వట్లేదన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తు గా పరిగణించాలని డిమాండ్ చేశారు.

వర్ష నష్టంపై కేంద్ర ప్రతినిధుల బృందం సైంటిఫిక్ గా వ్యవహరించలేదన్నారు AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. వరద బాదితుల ను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి GHMC అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందం వచ్చింది పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి… కానీ వాళ్ళు మాత్రం తాజ్ డెక్కన్ లో ఉన్నారన్నారు. కనీసం ఏరియల్ సర్వే చేసే సమయం CM కు లేదా అని ప్రశ్నించారు. సీఎం కు తన ఫాంహౌజ్ లో చెట్ల పై ఉన్న ప్రేమ… వరదల్లో ఉన్న ప్రజలపై ..పంట మునిగిన రైతులపై లేదన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం.. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న దొపిడి పై కేంద్ర బృందానికి లేఖ రాసామన్నారు. వరద సహాయాన్ని..టీఆర్ ఎస్ తన ఓటు బ్యాంకు గా మలుచుకుంటోందన్నారు. అంతేకాదు.. వరదల్లో చనిపోయిన వారి లెక్కలు ప్రభుత్వం దాస్తోందన్నారు.

వరద బాదితులకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.10వేలు సరిపోవని…50 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని, రైతులకు ఎకరాకు 20వేల చొప్పున పంట నష్టం సహాయం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.