
- మస్తు మంది వచ్చిన్రు
- ప్రజాపాలనకు ఊహించని స్పందన
- భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం
- బల్దియా పరిధిలో 600 కేంద్రాలు ఏర్పాటు
- కొన్ని చోట్ల అప్లికేషన్లు అందక ఇబ్బందులు
హైదరాబాద్,వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో తొలి రోజు ప్రజాపాలనకు మస్తు స్పందన వచ్చింది. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గురువారం నిర్వహించగా జనం భారీగా తరలివచ్చారు. సిటీలో 600 కేంద్రాల్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగించారు. అప్లయ్ చేసుకునేందుకు వచ్చిన వారితో సెంటర్లలో రద్దీ నెలకొంది.
వచ్చే నెల 6వ తేదీ వరకు గడువు ఉండగా మొదటి రోజే జనం అధికంగా వచ్చారు. ప్రధానంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500కు గ్యాస్ సిలిండర్, చేయూత, గృహలక్ష్మి సాయం కోసం దరఖాస్తులు అందించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారులు అప్లికేషన్లు స్వీకరించారు. త్వరలోనే దరఖాస్తుదారులకు సమాచారం మెసేజ్‌ల ద్వారా పంపిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్దకు భారీగా జనం తరలిరావడంతో శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసు బందోబస్తు కొనసాగించారు. జనం కోసం అవసరమైన సదుపాయాలు కల్పించారు.
దరఖాస్తులను నింపేందుకు వలంటీర్లు
మొదటి రోజు కేంద్రాల్లో దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. వాటిని నింపేందుకు వలంటీర్లను కూడా నియమించారు. ఒక్కో కేంద్రానికి 200 నుంచి 250 ఫారాలు మాత్రమే ఇవ్వగా అందరికి అందలేదు. దీంతో కొందరు జిరాక్స్‌సెంటర్ల వద్ద నుంచి తెచ్చుకుని అప్లై చేసుకోవడం కనిపించింది. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 9 రోజుల సమయం ఉండగా ఫస్ట్ రోజే జనం ఊహించనంతగా తరలివచ్చారని సంబంధిత అధికారులు తెలిపారు. కొన్ని సెంటర్లలో ఫామ్‌ల కోసం ఇబ్బంది ఏర్పడింది. ఇదే అదునుగా కొందరు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తులకు రూ. 30 – రూ.50 వసూలు చేశారు. దరఖాస్తులను నింపడానికి కూడా కలిపి తీసుకోవడం జరిగింది. కొన్ని సెంటర్ల వద్ద కొందరు జీహెచ్ఎంసీ సిబ్బందే దరఖాస్తు ఫారాలను నింపి ఇచ్చారు.
పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లకే ఎక్కువగా..
ప్రజా పాలనలో వివిధ స్కీమ్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ కోసమే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత చేయూత, మహాలక్ష్మి అప్లికేషన్లు ఉన్నట్టు వెల్లడించారు. చాలా మంది రేషన్ కార్డు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా.. అధి
కారులు ఇచ్చిన ఫామ్‌లో కాలమ్ లేకున్నా తెల్లకాగితంపై రాసి దానికి జత చేసి అందజేశారు. కొన్ని సెంటర్లలో రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవద్దని, ప్రభుత్వ ప్రకటన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలకే దరఖాస్తులు స్వీకరించడం, రేషన్ కార్డులకు వచ్చినవారికి చాన్స్ లేకపోవడంతో కొందరు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుందని, ఆ తర్వాత అప్లయ్ చేసుకోవాలని సూచించారు.
స్థానికంగా నిర్వహిస్తున్నట్లు తెలియక..
ప్రజా పాలన స్థానికంగానే నిర్వహిస్తున్నట్టు తెలియక చాలా మంది ప్రభుత్వ ఆఫీసులకు బారులు తీరారు. అంబర్‌పేటలోని తహసీల్దార్ ఆఫీసుకు వందల మంది వచ్చి వెనుదిరిగారు. హైదరాబాద్ కలెక్టరేట్‌కు కూడా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి వాపస్వెళ్లారు. అయితే తాముండే కాలనీల్లోనే ప్రజా పాలన ఏర్పాటు చేసినట్టు తెలిసి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా బాగా ఉంది. చాలా కేంద్రాల్లో బల్దియా ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేసిన అధికారులు అవగాహన కల్పించారు.
పింఛన్ కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా..
2018లో జరిగిన యాక్సిడెంట్లో కాలు విరిగింది. పెన్షన్ కోసం మూడేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. ఇంత వరకు రాలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రజా పాలనలోనూ అప్లయ్ చేసుకున్నా. ఇప్పుడైనా వస్తుందనే ఆశ కలిగింది.
- దాసరి అంజలి, ఖైరతాబాద్
ఈజీగా ఉంది..
ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం తహశీల్దార్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవడం చాలా ఈజీ అయింది. ఆధార్, రేషన్‌కార్డు పెడితే చాలని అధికారులు చెప్పారు. ఇది ఎంతో బాగుంది.
- అన్నపూర్ణ, గృహిణి, అంబర్‌పేట
మహిళలకు చేయూత సంతోషం
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు గ్యాస్‌కు రూ.500 ఇవ్వడం, ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. ఈ స్కీమ్స్ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతోఉపయోగపడుతాయి.
- స్వరూపారాణి, సికింద్రాబాద్