హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంతో..రూ.195 కోట్ల ఆమ్దానీ

హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంతో..రూ.195 కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి రూ.195.24 కోట్ల ఆమ్దానీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్ర్కాప్​ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం నిర్వహించిన ఆన్​లైన్ వేలంలో 9 ప్లాట్లు అమ్ముడుపోయాయి. 38 ప్లాట్లకు వేలం నిర్వహిస్తామన్నప్పటికీ కేవలం 9 ప్లాట్లకే వేలం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా రంగారెడ్డి, మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లాల్లోని ప్లాట్ల వేలం నిర్వహించారు.

 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సంగారెడ్డి జిల్లా ప్లాట్ల వేలం కొనసాగింది. రంగారెడ్డి జిల్లాలో గజం లక్షా11 వేల ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలో 3 ప్లాట్లకి సంబంధించి 12,584 చదరపు గజాల స్థలానికి రూ.98.01 కోట్ల ఆమ్దానీ వచ్చింది. మేడ్చల్–మల్కాజిగిరిలో 4 ప్లాట్లకి సంబంధించి 12,160 చదరపు గజాలకి రూ.62.09కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 2 ప్లాట్లలో 7,986 చదరపు గజాల స్థలానికి  రూ.35.14 కోట్లు వచ్చాయి. మిగిలిన 21 ప్లాట్ల సేల్​కు 3 రోజుల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు హెచ్​ఎండీఏ తెలిపింది.