
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకున్నాయి జలాశయాలు. ఈ క్రమంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర వీకెండ్ సందడి నెలకొంది. నిండు కుండలా మారిన హిమాయత్ సాగర్ ను చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. అయితే.. కొంతమంది జనం అత్యుత్సాహంతో చేపలను పట్టేందుకు రిస్క్ చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తే దగ్గర మూసీ లోపలి దిగి ఫిషింగ్ చేస్తున్నారు జనం. గుంపులు గుంపులుగా వచ్చి చేపలు పడుతున్నారు. మరో వైపు వరద నీటిలోకి దిగి డేంజరస్ గా సెల్ఫీలు దిగుతూ, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు యువకులు. ఇంత జరుగుతున్నా హిమాయత్ సాగర్ దగ్గర పోలీసులు లేకపోవడం గమనార్హం. హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్ దగ్గర క్లోజ్ చేసి ఉన్నా కూడా గేట్ దూకి లోపలికి వెళ్తున్నారు కొంతమంది యువకులు. ఇదే ప్రాంతంలో గతంలో చేపలు పడుతూ జారిపడ్డారు యువకులు.
విచక్షణ లేకుండా యువకులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. హిమాయత్ సాగర్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని.. మితి మీరిన వ్యవహరించి ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్న యువకులను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా... ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండాయి. వికారాబాద్, తాండూర్, మోమిన్పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది.
వరద ఉదృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1789.25 అడుగులకు చేరినట్లు సమాచారం. 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 6 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 3 వేల 72 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.5 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.8 అడుగులకు చేరినట్లు తెలుస్తోంది. 300 క్యూసెక్యూల ఇన్ ఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 5 వేల 215 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.జంట జలాశయాల నుంచి 8,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు.మూసీలోకి భారీగా వరద నీళ్లు వస్తుండటంతో మూసి పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.