- రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర
- అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్న పందెంరాయుళ్లు
- ఒక్కో కోడి పెంపకానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు
భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోడి పందేలకు తెలంగాణ పుంజులు సై అంటున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ఉంటున్న వారు సైతం సంక్రాంతికి వచ్చి పెద్ద ఎత్తున కోడి పందేల్లో పాల్గొంటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగే పందేలకు ఇప్పటినుంచే కోళ్ల కోసం వెతుకుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పెంచుతున్న కోళ్లకు డిమాండ్పెరిగి, ముందస్తుగా బుక్చేసుకుంటున్నారు.
ఆయిల్ పామ్ తోటలే ప్రధాన ఆవాసాలు
జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, ఇల్లెందు, బూర్గంపహాడ్ మండలాల్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. ప్రధానంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పెద్ద ఎత్తున గల ఆయిల్‌పామ్ తోటలే వీటికి స్థావరాలు. ఈ రెండు మండలాల్లో 150కి పైగా దొడ్లు(కోళ్ల ఫామ్‌లు) ఉంటాయి. తోటల చుట్టూ నెట్ లు ఏర్పాటు చేసి షెడ్లు వేస్తారు. పందెం కోళ్లను సంక్రాంతికి 3 నెలల ముందు నుంచే పందేలకు సిద్ధం చేస్తుంటారు.
నెల రోజుల ముందు పందేలకు సంబంధించి ట్రైనింగ్ఇస్తుంటారు. పందెం కోళ్లకు బలవర్దక ఆహారం అందిస్తారు. రాగులు, గంట్లు, మెరుగుల మిశ్రమాన్ని మేతగా వేస్తారు. ఫైటింగ్ కు సిద్ధమయ్యే పుంజులకు మటన్ ఖీమా, బాదంపప్పు, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఫీడింగ్ ఇస్తారు. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు తరచూ మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఇస్తుంటారు. కోళ్లకు దాణా, ఇతరత్రా అవసరాలకు ఒక్కో కోడికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటారు.
ఆయిల్ పామ్తోటల్లోని చిన్న నీటి తొట్లలో పందెం కోళ్లకు స్విమ్మింగ్ నేర్పిస్తారు. స్విమ్మింగ్ చేసే కోళ్లు పందేల్లో ఉత్సాహంగా పాల్గొంటాయని పెంపకందారులు చెబుతున్నారు. పెనంను వేడి చేసి, దానిపై ఓ క్లాత్ ఉంచుతారు. అది వేడి అయ్యాక స్విమ్మింగ్ చేసిన పుంజుపై కప్పుతారు. బకెట్లో కొంత నీటిని తీసుకొని ఆల్కహాల్ కలిపి శాఖలను తీస్తారు. తద్వారా ఆ పుంజుకు ఫిట్నెస్ వస్తుంది.
పందెం కోళ్లలో రకాలు
మైల, కాకి డేగ, రసంగి, కోడి డేగ, పండు డేగ, గాజు కొక్కెర, సేతువా రకాల పందెం కోళ్లకు మంచి డిమాండ్ఉంది. కోళ్లకు వ్యాధులు సోకకుండా పెంపకందారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. పశు వైద్యులతో వారానికి రెండు రోజులు వైద్య పరీక్షలు చేయిస్తుంటారు.
రూ.2 లక్షల వరకు ధర
తెలంగాణకు సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, భద్రాచలం సరిహద్దు ప్రాంతాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. సంక్రాంతి సందర్భంగా వారం రోజులపాటు రూ. లక్షలు, రూ.కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పందేలు జరుగుతున్నాయి. ఒక్కో పందెం కోడిని రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
మేలు రకాల కోళ్లు అయితే ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుండటం విశేషం. పందెం రాయుళ్లు అడ్వాన్స్‌గా కోళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సంక్రాంతికి జరిగే కోళ్ల పందేలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు వేలాదిగా తరలివెళ్తుంటారు. పలువురు పొలిటికల్లీడర్లతోపాటు వ్యాపారులు అధిక సంఖ్యలో పందేల్లో పాల్గొంటుంటారు.
బొబ్బిలి ఏరియా పుంజులకు గిరాకీ
ఫైటింగ్ కు బొబ్బిలి ఏరియాకు చెందిన పుంజులకు మంచి గిరాకీ ఉంటుంది. అక్కడి పుంజులు చురుగ్గా ఉండటమే కాకుండా ఫైటింగ్ విషయానికి వస్తే వెనక డుగు వేయవనే ప్రచారం ఉంది. చివరి నిమిషం వరకూ బరిలో ఉండి కొట్లాడు తాయని చెబుతారు. కోళ్ల పెంపకదారులు బొబ్బిలి ఏరియాకు చెందిన ఒక్క పుంజైనా ఆ దొడ్లో ఉండాలని కోరుకుంటారు. బొబ్బిలి ప్రాంతానికి చెందిన నాణ్యమైన పందెం కోళ్ల బ్రీడ్‌ను తెచ్చి ఇక్కడ పెంచుతుంటారు.
