శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై ఎటు చూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్ లు పూర్తిగా నిండిపోయాయి. బయట క్యూలైన్లలో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లలతో ఉన్నవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల లగేజీ కౌంటర్ దగ్గర నుంచి... శ్రీవారి ప్రధానాలయం వరకు... ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, విద్యార్థులకు హాలిడేస్, కరోనా తగ్గడం, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్  కాటేజీలు,  బస్టాండ్, అన్నప్రసాద భవనం సహా తిరుమల గిరులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. శ్రీవారి ఆలయంలో గంటకు 4 వేల 500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనం లేట్ అవుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి రావాలనుకునే వారు పునరాలోచించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. రద్దీ సమయంలో VIPలు కూడా తిరుమల యాత్రపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం : -
టీడీపీ గెలిస్తేనే యువతకు భవిత


జగన్ తిన్నదంతా కక్కిస్తాం