టీడీపీ గెలిస్తేనే యువతకు భవిత

టీడీపీ గెలిస్తేనే యువతకు భవిత

‘‘ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం.. ఆయన ఆశయాలను సాధించడమే టీడీపీ లక్ష్యం’’ అని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటుడు బాలకృష్ణ  అన్నారు.పేదల జీవితాలను మార్చే లక్ష్యంతో 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలను తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ‘దేశమంటే మనుషులు కాదు.. దేశమంటే మట్టోయ్’ అన్నట్టుగా వైఎస్ జగన్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని బాలయ్య మండిపడ్డారు. టీడీపీ మళ్లీ  అధికారంలోకి వస్తేనే ఏపీ యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. మహానాడుకు  తరలివచ్చిన పసుపు సైన్యానికి అభినందనలు తెలిపారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మహానాడు వేదికగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగం చేసి, చలన చిత్ర రంగంలోకి ప్రవేశించి కోట్లాది మంది మనుసులో చోటు సంపాదించిన జన హృదయ విజేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ‘‘శ్రామికుడి చెమటలో నుంచి పుట్టింది తెలుగుదేశం..  రైతు కూలీల రక్తం నుంచి పుట్టింది తెలుగుదేశం.. కష్టజీవి కంటి మంటల నుంచి పుట్టింది తెలుగుదేశం.. అన్నార్తుల ఆక్రందనల నుంచి పుట్టింది తెలుగుదేశం.. పేదల కన్నీళ్ల నుంచి పుట్టింది తెలుగుదేశం’’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ లు విని తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున కేకలు వేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. 


మరిన్ని వార్తలు..

కామెడీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం

దీపిక..డ్రెస్సింగ్ సెన్స్