అయ్యప్ప స్వాముల అరిగోస

అయ్యప్ప స్వాముల అరిగోస

శబరిమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరిగిపోతున్నది. అయ్యప్ప దర్శనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మాలధారణ చేసి, కఠిన నియమాలు పాటిస్తూ శబరిమలకు వస్తారు. అయ్యప్ప మాల విరమణకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. అటు ప్రభుత్వంగానీ, ఇటు శబరిమల ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్ కోర్ బోర్డు గానీ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అయ్యప్ప దర్శనానికి ప్రతి రోజు దాదాపు 80,000 నుంచి 1,20,000 మంది భక్తులు వస్తున్నారు.

భక్తులతో  క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోతున్నాయి. అయ్యప్పస్వామి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతున్నది. మరోవైపు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ కారణంగా అయ్యప్ప భక్తులు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు వాహనాల్లోనే నిరీక్షిస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అధికారులు రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. భక్తులను పంబా నది వద్దకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. జనవరిలో మకరజ్యోతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా ఈసారి నెల రోజుల ముందునుంచే అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. గత నలభై రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. కేరళ ప్రభుత్వానికి, దేవస్థానానికి వందలకోట్లలో ఆదాయం సమకూరింది. 

కేరళ హైకోర్టు సీరియస్​

కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఏర్పాట్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏంటని భక్తులతోపాటు ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేరళ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. భక్తులను దేవుడికి దూరం చేయాలనే కుట్రలో భాగంగానే పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులతో క్యూలైన్లు అన్నీ నిండిపోతున్నాయి. రష్ ని కంట్రోల్ చేయడానికి కేరళ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలేదు. క్యూలైన్లు అపరిశుభ్రంగా మారి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. భక్తుల కోసం టాయిలెట్ల సౌకర్యాలను కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయలేదు. లైన్లలో నిల్చున్న భక్తులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదు. 

భక్తులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేశారంటేనే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  కొందరు భక్తులు రద్దీని తట్టుకోలేక అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధ మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ ట్రాఫిక్ కారణంగా గంటలకొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ ఘటనలపై తాజాగా కేరళ హైకోర్టు సీరియస్ అయ్యింది.  అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద దాదాపు 300 వరకు కేసులు నమోదైనట్టు హైకోర్టు తెలిపింది. శబరిమల మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల దగ్గర భక్తులకు అల్పాహారం, నీరు అందించాలని కేరళ సర్కారును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

స్వాములకు వసతులు కల్పించాలి

ఏ దేవస్థానంలోనైనా ప్రత్యేక సందర్భాల్లో, పండుగ పూటలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కానీ రద్దీని నియంత్రించడానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంతో ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా అంతగా ఇబ్బంది ఉండదు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏర్పాటు చేసే వసతుల కారణంగా భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడరు. గంటలపాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ అధికారులు అల్పాహారం అందిస్తారు. 

కంపార్ట్మెంట్లలో టాయిలెట్ల వసతులు కూడా ఉంటాయి ఇందువల్ల భక్తులు అక్కడ విశ్రాంతి తీసుకొనే వీలుంటుంది. కానీ, శబరిమల ఆలయంలో ఇటువంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల విరమణ సమయంలో రద్దీ ఉంటుందని తెలిసినప్పటికీ ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అడవి మార్గం గుండా పెద్ద పాదం అనే కఠినమైన దారిలో 50 కిలోమీటర్లు నడిచి వచ్చే అయ్యప్ప భక్తులు ఎంతగానో అలసిపోతారు. వారు అయ్యప్ప సన్నిధానాన్ని చేరుకొని దర్శనం చేసుకోవాలంటే మరో 10 నుంచి 15 గంటల సమయం పడుతున్నది. దీంతో ఆ భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే స్వాములు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని వసతులు కల్పించాలి. 

నేరడిగొండ సచిన్, ఉస్మానియా యూనివర్సిటీ