అర్ధరాత్రి 12 గంటల వరకే దర్శనానికి అనుమతి.. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

అర్ధరాత్రి 12 గంటల వరకే దర్శనానికి అనుమతి.. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి గురువారం రాత్రి భక్తులు పోటెత్తారు. దర్శనానికి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండటంతో చివరి తరుణంలో భక్తులు భారీగా తరలివెళుతున్నారు. భక్తులతో అన్ని క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర దర్శనం అనంతరం భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య గణనాథుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. మరోవైపు టస్కర్ పనులు కూడా కొనసాగుతున్నాయి. షీ టీమ్స్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో రద్దీ బాగా పెరిగింది. ఖైరతాబాద్​బడా గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులను గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతిస్తామని ఉత్సవ సమితి ప్రకటించిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 6వ తేదీన శోభాయాత్ర, నిమజ్జనం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, బడా గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్​నుంచి భారీ క్రేన్ను తీసుకువచ్చి ఎన్టీఆర్​గార్డెన్​ముందున్న హుస్సేన్​సాగర్​తీరంలో ఉంచారు. ఈ క్రేన్​సుమారు 200 టన్నులను అలవోకగా లిఫ్ట్​చేయగలదు. ఇక శోభాయత్ర కోసం గణపతిని తీసుకువెళ్లే అతి పెద్ద టస్కర్ను విజయవాడ నుంచి తీసుకురానున్నారు. బడా గణేశ్​పక్కన ఉన్న కన్యకాపరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీయ స్వామి విగ్రహాల తరలింపు కోసం కూడా హైదరాబాద్ నుంచి మరో టస్కర్ రెడీ చేస్తున్నారు.