వెళ్లి రండీ : హైదరాబాద్ - విజయవాడ హైవే.. ఫుల్ రష్.. సిటీలో ఉన్నట్లు

వెళ్లి రండీ : హైదరాబాద్ - విజయవాడ హైవే.. ఫుల్ రష్.. సిటీలో ఉన్నట్లు

పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అవుతుంది. జంట నగరవాసులంతా పట్నం నుంచి పల్లెలకు క్యూ కడుతారు. హైదరాబాద్ లో ఉన్న  వేలాది కుటుంబాలు  సంక్రాంతి పండుగకు  తమ స్వంత ఊర్లకు పయనమయ్యారు.   దీంతో శుక్రవారం  సిటీ శివార్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీలో  రోజు ట్రాఫిక్ ఎలా ఉంటుందో హైదరాబాద్ - విజయవాడ హైవేపై అంతగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉన్న సిటీ అంతా ఖాళీ చేసి అక్కడకు వెళ్లిందన్నట్లుగా మారింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద బారులు తీరాయి. హైదరాబాద్‌కు సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెలుగు రాష్ట్రాలకు వెళ్లే వారి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.  రద్దీ దృష్ట్యా అధికారులు అదనంగా 10 గేట్లను తెరిచారు. ఫాస్ట్ ట్యాగ్ సదుపాయం వల్ల టోల్ ప్లాజా ద్వారా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.

టోల్ ప్లాజాలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతుంటాయి  సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్య 70,000 వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని రైల్వే, బస్ స్టేషన్‌లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

జనవరి 12 నుంచి అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు కావడంతో  రానున్న రెండు రోజుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.  రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు  టీఎస్‌ఆర్‌టీసీ  ప్రకటించింది. ఈ బస్సులు జనవరి 6 నుండి 15 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ,మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలను కవర్ చేస్తాయి.