ఠాక్రే సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఠాక్రే సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరగనున్న బల నిరూపణపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం గురువారం బల నిరూపణ జరపాలని తేల్చి చెప్పింది. దాదాపు మూడున్నర గంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఠాక్రే సర్కారు రేపు శాసనసభలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గురవారం బలం నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సురేష్ ప్రభు పిటీషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అంతకు ముందు అసెంబ్లీలో బల నిరూపణకు సంబంధించిన పిటిషన్పై శివసేన తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం తేలాకే బలపరీక్షకు అనుమతివ్వాలని వాదించారు. ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్న విషయాన్ని ఆయన న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బల నిరూపణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

బల పరీక్షకు కేవలం ఒక్కరోజు గడువు ఇచ్చిన విషయాన్ని సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గురువారం జరగనున్న బలపరీక్షలో పాల్గొనే ఎమ్మెల్యేల్లో కొందరిపై అనర్హత వేటు ఉందని, రాజ్యాంగం ప్రకారం వారు సభ్యత్వాన్ని కోల్పోయినట్లే అని కోర్టుకు విన్నవించారు. అలాంటప్పుడు వారు ఓటు హక్కు ఎలా ఉపయోగించుకుంటారని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై జూలై 12న స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, అనర్హత పిటిషన్ పక్కన పెట్టి ఫ్టోర్ టెస్ట్ నిర్వహించిన సందర్భాలు గతంలో లేవన్న విషయాన్ని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు.