హైదరాబాద్లోని ఈ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ లేరు.. ఇంట్లో చూస్తే అస్థి పంజరం కనిపించింది !

హైదరాబాద్లోని ఈ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ లేరు.. ఇంట్లో చూస్తే అస్థి పంజరం కనిపించింది !

హైదరాబాద్: హైదరాబాద్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉందంటే.. ఇస్తే అద్దెకైనా ఇస్తారు లేదా అమ్మేస్తారు. ఆ ఇంటి ఓనర్ ఈ రెండూ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏడేళ్ల నుంచి ఆ ఇంటికి తాళం వేసే ఉంది. స్థానిక యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ ఇంట్లోకి బంతి వెళ్లిందంటే మర్చిపోవాల్సిందే. ఎప్పుడూ.. ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లే ఆలోచన చేయలేదు. కానీ.. ఆ ఇల్లు ఎలా ఉందో చూడాలన్న అత్యుత్సాహం ఒక యువకుడు ఆ ఇంట్లోకి వెళ్లేలా చేసింది. ఆ ఇంటి వెనుక వైపు నుంచి, మేడపైకి ఎక్కి ఆ యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంటి గార్డెన్లో ఆ ఇంట్లోకి కొట్టిన బంతి ఒకటి కనిపించింది. ఆ బంతిని చూపించాడు.

ఇంట్లోకి వెళ్లి చూస్తే సామాన్లన్నీ దుమ్ముకొట్టుకుని కనిపించాయి. ఇల్లంతా బూజు పట్టి ఉంది. అయితే.. ఆ యువకుడు ఊహించని దృశ్యం ఒకటి ఆ ఇంట్లో కనిపించింది. ఒక మనిషి అస్థి పంజరం ఒకటి ఫ్రిజ్ ముందు కనిపించే సరికి ఆ యువకుడికి దిమ్మ తిరిగిపోయింది. ఆ అస్థి పంజరాన్ని వీడియోలో హైలైట్ చేశాడు. ఇలా.. తనకు ఒక అస్థి పంజరం కనిపించిందని వీడియోలో చెప్పి ఆ ఇంటి నుంచి బయటికొచ్చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‪లోడ్ చేయడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఇంట్లో మనిషి అస్థి పంజరం లభ్యమైన ఈ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఏడు సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని.. ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అస్థి పంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read:-పచ్చని కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు.. భర్త వ్యామోహం ఖరీదు భార్య ప్రాణం.. వరంగల్లో విషాదం

ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం స్పాట్కు చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆ చనిపోయిన వ్యక్తి పురుషుడో, స్త్రీనో తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారా (లేక) హత్య చేసి చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ అస్థి పంజరం అమీర్ ఖాన్ అనే వ్యక్తిది అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆస్తి, పెళ్లి విషయంలో తన అన్నదమ్ములతో అమీర్ ఖాన్కు గొడవ జరిగింది. 

హైదరాబాద్లో కరోనా కేసులు పెరిగిన సమయంలో ఇంట్లో వాళ్లతో గొడవ పడి అమీర్ ఖాన్ కనిపించకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతనిని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అతను అదృశ్యమయ్యాడని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఈ అస్థి పంజరం అతనిదే అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఒక అంచనాకొచ్చారు.