పచ్చని కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు.. భర్త వ్యామోహం ఖరీదు భార్య ప్రాణం.. వరంగల్లో విషాదం

పచ్చని కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు.. భర్త వ్యామోహం ఖరీదు భార్య ప్రాణం.. వరంగల్లో విషాదం

వరంగల్: పర స్త్రీ వ్యామోహం పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెళ్లి నాటి ప్రమాణాలకు కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆలుమగలు ఈ పక్క చూపుల మూలాన అర్థాంతరంగా విడిపోతున్నారు. ఇంకొందరు చంపేందుకు వెనకాడటం లేదు. మరికొందరు కలలన్నీ చెదిరిపోయాయనే నిరాశతో నిండు నూరేళ్ల జీవితానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి తనువు చాలిస్తున్నారు. వరంగల్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.

వరంగల్లో ప్రత్యూష అనే వైద్యురాలి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రత్యూష హసన్పర్తిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త సృజన్ను హసన్ పర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యూష తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రత్యూష భర్త సృజన్ వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రత్యూష మరో హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేస్తోంది. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఈ ఇద్దరూ పెళ్లైన కొంత కాలం  బానే ఉన్నారు. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే.. ఒక ఇన్ స్టాగ్రాం ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి సృజన్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. విడాకులు ఇస్తానని ప్రత్యూషను బెదిరించాడు. విషయం పెద్దది చేస్తే ఇన్ ఫ్లుయెన్సర్ను పెళ్లి చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో.. ప్రత్యూషకు ఏం చేయాలో పాలుపోలేదు. భర్త మరో యువతి మోజులో పడి తనను, పిల్లలను నిర్లక్ష్యం చేయడంతో తనలో తాను కుమిలిపోయి ప్రత్యూష నరకయాతన అనుభవించింది. ఆ మానసిక ఒత్తిడి కారణంగా ప్రత్యూష ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సృజన్కు వరంగల్కు చెందిన ఒక ఇన్ స్టా్గ్రాం ఇన్ఫ్లుయెన్సర్తో పరిచయం ఏర్పడింది. ఆమెకు, సృజన్కు ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ కారణంగా ఏర్పడిన పరిచయం ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేంత వరకూ వెళ్లింది.

►ALSO READ | నల్ల రంగు వివక్షపై మాట్లాడి.. మిస్ పుదుచ్చేరిగా గెలిచింది.. : 25 ఏళ్ల మోడల్ ఆత్మహత్య మిస్టరీ ఏంటీ..?

భార్యాపిల్లలను పట్టించుకోకుండా ఆ ఇన్ఫ్లుయెన్సర్తో కలిసి సినిమాలు, షికార్లు.. ఇలా ఈ డాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్ విచ్చలవిడితనానికి అంతూపొంతూ లేకుండా పోయింది. ఇన్ స్టాగ్రాంలో సదరు ఇన్ఫ్లుయెన్సర్ యువతికి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆమె చేసిన కొన్ని వీడియోలకు మిలియన్లలో వ్యూస్ ఉన్నాయి. నిన్నమొన్నొచ్చిన శ్రీలీల ‘వైరల్ వయ్యారి నేను’ పాటకు కూడా ఈ యువతి డ్యాన్స్ చేస్తూ రీల్ చేసి అప్ లోడ్ చేసింది. ఈ బుట్టబొమ్మ అందచందాలకు మైమరిచిపోయిన ఈ డాక్టర్ సృజన్ తన భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రత్యూష చావే శరణ్యమని ఆత్మహత్యకు పాల్పడిందని, సృజన్ ఇలా చేస్తున్నాడని చెప్పినా అతని తల్లిదండ్రులు పట్టించుకోలేదని ప్రత్యూష తండ్రి మీడియా ఎదుట వాపోయాడు. తన కూతురి చావుకు కారణమైన సృజన్ను, అతని తల్లిదండ్రులను, సదరు ఇన్ఫ్లుయెన్సర్ యువతిని పోలీసులు కఠినంగా శిక్షించి ప్రత్యూషకు న్యాయం చేయాలని ఆమె తండ్రి వేడుకున్నాడు.