శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహారెడ్డి.. కుటుంబానికి అండగా ఉంటామని హామీ!

 శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహారెడ్డి.. కుటుంబానికి అండగా ఉంటామని హామీ!

హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఆ విషాద ఘటన తెలుగు సినీ లోకాన్ని కలిచివేసింది. ఆ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయి, ప్రాణాపాయ స్థితి నుంచి పోరాడి  బయటపడ్డాడు  చిన్నారి శ్రీతేజ్. లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి బుధవారం ( మే 6, 2026 ) శ్రీతేజ్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మరోసారి అల్లు కుటుంబం స్పష్టం చేసింది.

కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు

శ్రీతేజ్ ఇంటికి చేరుకున్న అల్లు అరవింద్, స్నేహ రెడ్డి ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు ఐసీయూలో మృత్యువుతో పోరాడి, ప్రస్తుతం పునరావాస చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్న తీరును చూసి వారు చలించిపోయారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమ కష్టాలను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.

చదువు బాధ్యత నాదే

శ్రీతేజ్ సోదరి భవిష్యత్తు కోసం ఆమె చదువుకు అయ్యే సంపూర్ణ ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ ప్రకటించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఒక తండ్రిలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇప్పటికే ఆ కుటుంబం కోసం సుమారు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అందులో శ్రీతేజ్ పేరు మీద రూ. 2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని వైద్య ఖర్చులకు, తక్షణ అవసరాలకు వెచ్చించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన నాటి నుండి నేటి వరకు ఆ చిన్నారి మెరుగైన చికిత్స పొందేలా మైత్రీ మూవీ మేకర్స్, అల్లు కుటుంబం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి.

ఒకవైపు శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటూనే, మరోవైపు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం 'రాకా' పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, తన అభిమాని కుటుంబాన్ని విస్మరించకుండా బాధ్యతగా వ్యవహరించడం పట్ల అభిమానులు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో అల్లు ఫ్యామిలీ మరోసారి తమ పెద్ద మనసు చాటుకుంది అభినందిస్తున్నారు..