పీహెచ్‌‌డీ చేస్తున్న రోబో!..చదవకుంటే మ్యూజియానికే..

పీహెచ్‌‌డీ చేస్తున్న రోబో!..చదవకుంటే మ్యూజియానికే..

మనుషులు చేయలేని ఎన్నో పనులు చేస్తున్న రోబోలకు చదువుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే చైనాలో ఒక హ్యూమనాయిడ్‌‌ రోబోకు పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్‌‌లో చేరేందుకు అనుమతిచ్చారు. ఒకవేళ అది బాగా రీసెర్చ్‌ చేసి, పీహెచ్‌‌డీ పూర్తి చేస్తే ప్రపంచంలో డాక్టరేట్ అందుకున్న మొదటి రోబోగా రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేయడం ఖాయం.

చైనా తయారుచేస్తున్న హ్యూమనాయిడ్ ఏఐ రోబోలు ఇప్పటికే ఎన్నో రంగాల్లో రాణిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో అద్భుతమైన సేవలందిస్తున్న ఏఐ రోబోలు ఇప్పుడు సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాయి. జుయెబా 01 అనే హ్యుమనాయిడ్‌‌ రోబో ఈ మధ్యే షాంఘై థియేటర్ అకాడమీ (ఎస్‌‌టీఏ)లో డ్రామా అండ్‌‌ ఫిల్మ్‌‌ విభాగంలో నాలుగు సంవత్సరాల పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్‌‌లో స్టూడెంట్‌‌గా చేరింది. ప్రపంచంలో ఒక మెషిన్‌‌కు పూర్తి డాక్టోరల్- అభ్యర్థి హోదా లభించడం ఇదే మొదటిసారి. ఈ రోబోను డ్రాయిడ్‌‌అప్‌‌ రోబోటిక్స్‌‌ అనే కంపెనీతో కలిసి షాంఘై యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసింది. 

ఒపెరా ఆర్ట్‌‌పై..

జుయెబా 01 ఏఐ రోబో ‘ఒపెరా’(ట్రెడిషనల్‌‌ చైనీస్‌‌ మ్యూజిక్ థియేటర్‌‌‌‌ ఆర్ట్‌‌)పై రీసెర్చ్‌‌ చేస్తోంది. దీనికి ఇప్పటికే వర్చువల్ స్టూడెంట్ ఐడీ ఇచ్చారు. ఈ రోబోకు మెంటార్‌‌‌‌గా ప్రఖ్యాత షాంఘై ఆర్టిస్ట్‌‌, ప్రొఫెసర్ యాంగ్ క్వింగ్కింగ్ వ్యవహరిస్తున్నారు. అందమైన పురుషుడి ముఖం, సిలికాన్ చర్మంతో ఈ రోబో అందర్నీ ఆకట్టుకుంటోంది. 1.75 మీటర్ల పొడవు, 30 కిలోల బరువున్న జుయెబా 01 అద్దాలు పెట్టుకుని చొక్కా, ప్యాంటు ధరించి హుందాగా కనిపిస్తుంది. ఇది చైనా లాంగ్వేజ్‌‌ మాండరిన్‌‌లో మాట్లాడగలదు. ఇప్పటికే ప్రపంచంలోని మొట్టమొదటి హ్యూమనాయిడ్ హాఫ్-మారథాన్‌‌లో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది. ఇది ముఖ కవళికలపై కూడా ట్రైనింగ్‌‌ తీసుకుంది. సెప్టెంబర్ 14 నుంచి యూనివర్సిటీలో క్లాస్‌‌లకు హాజరుకానుంది. ఇతర పీహెచ్‌‌డీ స్టూడెంట్స్‌‌తో కలిసి ఒపెరా ఆర్ట్‌‌ రిహార్సల్ చేస్తుంది. ఇది ముఖ్యంగా స్టేజ్‌‌ ఫెర్ఫార్మెన్స్‌‌, స్క్రిప్ట్ రైటింగ్, సెట్ డిజైన్ లాంటివాటితో పాటు మోషన్‌‌ కంట్రోల్‌‌, లాంగ్వేజ్‌‌ జెనరేషన్‌‌ లాంటి సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేస్తుంది.

చదవకుంటే మ్యూజియానికే.. 

చైనీస్ ఒపెరా ఆర్ట్‌‌కు అవసరమైన వ్యక్తీకరణలు, స్వరాలు రోబో నేర్చుకోగలదా? అనే అనుమానం ఎంతోమందిలో ఉంది. జుయెబా 01ని ఒక స్టూడెంట్‌‌ ఇదే ప్రశ్న అడిగితే.. “నేను చదవలేకపోతే నా సిస్టమ్, డేటాని డౌన్‌‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. లేదా డిలీట్‌‌ చేయొచ్చు. పీహెచ్‌‌డీ పూర్తి చేయలేకపోతే నన్ను మ్యూజియంకు విరాళంగా ఇస్తానని ప్రొఫెసర్ యాంగ్ అన్నారు. అది కూడా మంచి ఆలోచనే. కనీసం నేను ఆర్ట్ హిస్టరీలో భాగం అవుతా” అని సమాధానం ఇచ్చింది.