మొబైల్ ఫోన్లతో మనిషిలో క్రియేటివిటీ లోపిస్తుంది : వెంకయ్యనాయుడు

మొబైల్ ఫోన్లతో మనిషిలో క్రియేటివిటీ లోపిస్తుంది :  వెంకయ్యనాయుడు

గచ్చిబౌలి, వెలుగు : మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా వాడితే మనిషిలో క్రియేటివిటీ లోపిస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం గచ్చి బౌలి ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ కాలేజీ ఏర్పాటు చేసిన రెసోఫెస్ట్ కాలేజీ ఫెస్టివల్ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి భాగమయ్యాయని తెలిపారు. 

వీటిని ఎక్కువగా వాడితే ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతామని, ప్రతి దానికి గూగుల్ పై ఆధార పడాల్సి వస్తుందని చెప్పారు. మాతృభాషపై మొదట పట్టును సాధించి అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలన్నారు. విద్య అనేది డిగ్రీ కోసం కాదని.. ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొదించుకోవడం కోసమని వెల్లడించారు. ఆరోగ్యకరమైన వ్యాయామ నియమావళిని కలిగి ఉండాలని సూచించారు.  ప్రతిరోజూ యోగా చేయాలన్నారు. 

పోషక విలువలు గల భారతీయ ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు.  ఫాస్ట్ ఫుడ్స్ తింటే రోగాలకు ఆహ్వానం పలికినట్టేనని స్పష్టం చేశారు.  ‘దేశం మొదట, నేను చివర’ అనే ధ్యాసతో ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాతృభూమికి కృతజ్ఞతతో ఉండాలని కోరారు. రెసోనెన్స్ ప్రారంభం నుచి పది లక్షల మంది విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇవ్వడం సంతోషకరమైన విషయమని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్యనటుడు బ్రహ్మానందం, రెసోనెన్స్ ఎడ్యువెంచర్ ఎండీ ఆర్ కే. వర్మ, హైదరాబాద్ రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, విద్యార్థులు పాల్గొన్నారు.