ఇండోనేసియాలో పేలిన​ అగ్నిపర్వతం

ఇండోనేసియాలో పేలిన​ అగ్నిపర్వతం
  •     మళ్లీ కట్టిన బ్రిడ్జి కూడా ధ్వంసం
  •     స్థానికులు అప్రమత్తం కావడంతో తప్పిన పెనుముప్పు

సంబర్ వులూ: ఇండోనేసియాలోని సెమెరు అగ్నిపర్వతం బద్దలు కావడంతో సమీప  గ్రామాల్లో వందలాది ఇండ్లు, మసీదులు కాలిపోయాయి. ఇటీవలే మళ్లీ కట్టిన బ్రిడ్జి మరోసారి దెబ్బతిన్నది. లుమజాంగ్  జిల్లాలోని సంబర్ వులూ, సూపితురంగ్  గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా ఈ అగ్ని పర్వతం ఆదివారం పేలిపోయింది. దీంతో ఆకాశంలో 1500 మీటర్ల వరకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమీప గ్రామాలను పొగ కమ్మేసింది. ముందుగానే అలర్ట్  అయిన స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పెనుముప్పు తప్పింది. ఆదివారం వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్​ను సోమవారం​ చేపట్టినట్లు అధికారులు వివరించారు.

అగ్ని పర్వతం నుంచి ఎగిసిపడ్డ లావా ఇండ్లను కప్పేసిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. 3,676 (12 వేల అడుగులు)  మీటర్ల ఎత్తులో ఉన్న సెమెరు అగ్నిపర్వతం .. భారీ వర్షాల కారణంగా రాపిడికి గురై పేలిపోయిందని, దీంతో ఆ పర్వతం నుంచి లావా సమీపంలోని నది, గ్రామాల వైపు ప్రవహించిందని చెప్పారు. ముందే అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదని వివరించారు. కాగా, నిరుడు డిసెంబర్ లోనూ ఈ అగ్నిపర్వతం పేలి లావా పొంగి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 51 మంది చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.